Delhi: క్షణికావేశంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవితాలను తల కిందులు చేస్తాయి. తెలిసో తెలియకో కొందరు చేసే పనులు తమ జీవితాలతో పాటు ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసిన సంఘటనలు నిత్యం ఏదో చోట కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ దారుణ సంఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఒక అమ్మాయి గురించి ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన గొడవ ఏకంగా ఒక మనిషి ప్రాణం తీసేందుకు దారి తీసింది.
వివరాల్లోకి వెళ్లితే.. ఢిల్లీలోని మల్కాగంజ్ ప్రాంతానికి చెందిన ప్రిన్స్ (20), మిహిర్ (21)లపై సిద్దార్థ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఓ అమ్మాయి విషయంలో గత కొన్ని రోజులుగా చెలరేగిన గొడవల నేపథ్యంలో ఆదివారం సిద్దార్థ్ ఇద్దరిపై అత్యంత దారుణంగా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దిరినీ వారి కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స జరుగుతున్న సమయంలోనే ప్రిన్స్ మరణించాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. అమ్మాయి విషయంలో వాగ్వాదం జరగడంతోనే సిద్దార్థ్.. ప్రిన్స్, మిహిర్‌లపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రిన్స్, మిహిర్ ఇద్దరు అన్నదమ్ములు. ఇక ప్రస్తుతం మిహిర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..