Lucknow Oxygen Cylinder Exploded: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆక్సిజన్ లక్నోలోని ఆక్సిజన్ రీఫిల్లింగ్ సెంటర్‌లో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. లక్నో- బారాబంకి రోడ్డులోని చిన్హాట్ ప్రాంతంలోని కేటీ వెల్డింగ్ స్టోర్ వద్ద ఈ పేలుడు సంభవించింది. మృతుల్లో ఒకరు ప్లాంట్‌లో పనిచేసేవారు కాగా.. మరొకరు కస్టమర్. మూడవ వ్యక్తిని ఇంకా గుర్తించలేదంటూ పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు కమిషనర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి పలు వివరాలు సేకరించారు.
మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు నింపుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. పేలుడుకు సంబంధించి కచ్చితమైన కారణాలు తెలియదని పోలీసు కమిషనర్ వెల్లడించారు. కాగా.. లక్నో పరిధిలో కేటీ వెల్డింగ్ స్టోర్ ఆసుపత్రులను ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ఆక్సిజన్ నింపుతున్న క్రమంలో ఒత్తిడితో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదిలాఉంటే.. ఐదు రోజుల క్రితం కాన్పూర్‌లోని పంకి ప్రాంతంలోని ఆక్సిజన్ ఫిల్లింగ్ ప్లాంట్‌లో ఇలాంటి పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: