World Covid 19: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. రెండో విడతలోనూ కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రదేశాలు సైతం చేతులు ఎత్తేశాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ స్ట్రెయిన్ మరింత గుబులు పుట్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,76,309 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 11.95 కోట్లు దాటింది. కొత్తగా 8,997 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 26.50 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.06 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో కొత్తగా 63,468 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2.99 కోట్లు దాటింది. కొత్తగా 1,328 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 5.45 లక్షలు దాటింది.
గత ఏడాది ఆరంభంలో కఠినమైన లాక్‌డౌన్ పాటించిన ఇటలీ.. మళ్లీ వైరస్ కేసులను అదుపు చేసేందుకు ఇబ్బందిపడుతోంది. ఇటలీలో మరో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్తగా వైరస్ కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేయాలని అధికారు భావిస్తున్నారు. ఇందులో భాగంగా షాపులు, రెస్టారెంట్లు, స్కూళ్లను సోమవారం నుంచి మూసివేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌లో జరిగే ఈస్టర్ వేడుక వరకు షట్‌డౌన్ ఆంక్షలను అమలు చేసేందుకు ఇటలీ ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే ఆ దేశంలో కోవిడ్ వల్ల లక్ష మందికిపైగా మృతిచెందారు. బ్రిటన్ తర్వాత యూరోప్‌లో అత్యధిక స్థాయిలో కేసులు నమోదు అయిన దేశాల్లో ఇటలీ రెండవ స్థానంలో ఉన్నది.
ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుంది. తర్వాతి స్థానంలో బ్రెజిల్, ఇండియా, రష్యా, బ్రిటన్ కొనసాగుతున్నాయి. ఈ లిస్టులో ఇండియాని వెనక్కి నెట్టి బ్రెజిల్ సెకండ్ ప్లేస్‌కి వెళ్లింది. రోజువారీ కొత్త కేసుల్లో మళ్లీ బ్రెజిల్ టాప్‌కి వెళ్లింది. అక్కడ కొత్తగా 84,047 కేసులొచ్చాయి. బ్రెజిల్ తర్వాత అమెరికా, ఇండియా, ఇటలీ, ఫ్రాన్స్ నిలిచాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా… బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో బ్రెజిల్ (2,152) టాప్‌లో ఉంది. ఆ తర్వాత అమెరికా (1328), మెక్సికో (654), రష్యా (486), ఇటలీ (380) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇటు, దేశంలో కరోనా ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతోంది. ఎవరికి వాళ్లం అప్రమత్తంగా ఉండటం మంచిది. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకుతుంది. అందువల్ల వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని జాగ్రత్తలు పాటించకుండా ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏపీ సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో… దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ ఉందని తేలింది. అది చాలా వేగంగా వ్యాపించే రకం కావడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విదేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ… మరింత బలంగా తయారవుతోంది. అందుకే కేసులు పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు.