బ్లాక్ ఫంగస్ నే కాదు..ఇప్పుడు వైట్ ఫంగస్ కూడా జనాన్ని భయపెడుతోంది. ఇప్పుడు దేశమంతటా కోవిడ్‌తో పాటు బ్లాక్ ఫంగస్ టెన్షన్ పుట్టిస్తోంది. తాజాగా దేశంలో వైట్ ఫంగస్ కేసులు కూడా నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్ కన్నా వైట్ ఫంగస్ ప్రమాదకరం కావడం ఆందోళన కలిగిస్తోంది. వైస్ ఫంగస్ బారినపడుతున్న పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. బిహార్‌లోని పాట్నా మెడికల్ కాలేజీలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన మైక్రో బయాలజీ హెడ్ డాక్టర్ ఎస్ ఎన్ సింగ్ ఈ వైట్ ఫంగస్ కేసులు గుర్తించారు. ఈ ప్రాణాంతక వైట్ ఫంగస్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ప్రమాదమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి ముదిరితే ఇది ఊపిరితిత్తుల నుంచి గోళ్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మాంగాలు, నోటికి వ్యాపించే ప్రమాదముంది.
వైట్ ఫంగస్‌ను ఎలా గుర్తించారంటే?
కరోనా లక్షణాలతో ఉన్న నలుగురు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు. కరోనా రోగులకు చేసిన రాపిడ్ యాంటిజెన్, రాపిడ్ యాంటీబాడీ, ఆర్టీ-పిసిఆర్ పరీక్షలు నిర్వహించారు. అన్నీ పరీక్షల్లో నెగటివ్ గా రిపోర్టులు వచ్చాయి. అయితే వీరిలో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నందున మరోసారి హెచ్ ఆర్ సిటీ పరీక్ష నిర్వహించారు. మరోసారి వచ్చిన ఫలితాల్లోను కరోనా నెగెటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. ఈసారి మ్యూకస్ కల్చర్‌ను పరీక్షించారు. ఈ పరీక్షల్లో వైట్ ఫంగస్ బయటపడింది. ఊపిరితితుల్లో వైట్ ఫంగస్‌ను గుర్తించి వెంటనే యాంటి ఫంగల్ డ్రగ్స్ ఇచ్చారు వైద్యులు. సకాలంలో చికిత్స మొదలుపెట్టడంతో బాధితులు కోలుకుంటున్నారు. ప్రారంభ దశలోనే వైట్ ఫంగస్‌ను గుర్తించి, చికిత్స మొదలుపెడితే ప్రమాదమేమీ లేదంటున్నారు నిపుణులు. కానీ ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
వీరికి వైట్ ఫంగస్ రిస్క్ ఎక్కువ…
కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ వస్తోంది. వైట్ ఫంగస్ మాత్రం కరోనా లక్షణాలున్న వారిలో బయటపడుతోంది. వైట్ ఫంగస్… బ్లాక్ ఫంగస్ కన్నా ప్రమాదకరమని పాట్నా మెడికల్ కాలేజి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకరిలో కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించినా…పరీక్షల్లో నెగెటివ్ వస్తే మాత్రం వైట్ ఫంగస్‌కు సంబంధించిన పరీక్షలు తప్పనిసరి అంటున్నారు. ఇందు కోసం వీరికి మ్యూకస్ కల్చర్ పరీక్ష చేయించాలని సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి పరీక్షలు మస్ట్ అంటున్నారు. డయాబెటిస్ రోగులు, చాలా కాలంగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారికి ఎక్కువగా వైట్ ఫంగస్ బారినపడే అవకాశం ఉందంటున్నారు. బిహార్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండగా…ఇప్పుడు వైట్ ఫంగస్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి..దేశంలో థర్డ్ వేవ్ ఖాయమంటున్న వైద్య నిపుణులు.. ఎప్పుడు? ఎలా? ప్రభావంపై భిన్నాభిప్రాయాలు
అధికారిక నివాసాన్ని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్