
కోవిడ్-19 ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఇదే మాట. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. రోజుకూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభణ అతివేగంగా కొనసాగుతోంది. అత్యధిక కేసులతో ముందు వరుసలో ఉన్నటువంటి మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో తెలంగాణ, ఏపీ తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరిగిపోతోంది. కరోనా లక్షణాలు కనిపించినంత మాత్రంగానే కొందరు భయపడిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన ఓ మహిళకు కరోనా సోకిందని తెలియడంతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వ విభాగంలో స్వీపర్‌గా పని చేసే ఆమెకు జలుబు, జ్వరం రావడంతో కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు సూచించారు. మరో 19 మందితో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా టెస్టులు చేయించుకుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని తెలిసింది. హోం క్వారంటైన్లో ఉండాలని స్థానిక ఆశా వర్కర్లు సూచించారు. ఆశా వర్కర్ చెప్పగానే ఇంటికి వెళ్లిన సదరు కరోనా బాధితురాలు.. తర్వాత పురుగుల మందు కొనుగోలు చేసింది. పురుగుల మందు తాగి రోడ్డు మీదే పడిపోయింది. అది గమనించిన స్థానికులు కొందరు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కరోనా సోకిందనే భయం, మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబీకులు తెలిపారు.