
మహారాష్ట్రలో చాప కింద నీరులా పొలిటికల్ సంక్షోభం తలెత్తే సూచనలు కన్పిస్తున్నాయి. ఇందుకు ఆ రాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే.. ప్రధాని మోదీకి ఫోన్ చేయడమే. తమ రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉధ్ధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. తన పదవికిగండం వచ్ఛేలా ఉందన్న రీతిలో ఆయన కలవరం చెందినట్టు కనిపిస్తోంది. బుధవారం ఆయన మోదీకి ఫోన్ చేస్తూ.. కరోనాపై తమ ప్రభుత్వం పోరాటం జరుపుతున్న ఈ తరుణంలో ఇది సరికాదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తన అభ్యర్థనను పరిశీలించాలని ఆయన కోరినట్టు సమాచారం. ఉధ్ధవ్ థాక్రేని శాసన మండలికి నామినేట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫారసుపై గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఇంకా ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ కూటమి మధ్య అనేకసార్లు విభేదాలు తలెత్తిన విషయం గమనార్హం.