
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతోన్నాయి. దాదాపు వెయ్యికి దగ్గరలో కోవిడ్ కేసులు చేరుతున్నాయి. ఇప్పటికే వైరస్ కట్టడికి ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. తాజాగా ఈరోజు తెలంగాణలో కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ఇవాళ 26 మంది డిశ్చార్జి అయినట్లు మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. కాగా కొత్తగా నిర్థారణ అయిన వాటితో కలిసి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 983కి చేరాయి. ఇప్పటివరకూ కరోనాతో 24 మంది మృతి చెందారు. అలాగే నిన్నటివరకూ 262 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏడుగురు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వివరించారు మంత్రి ఈటెల.
ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇవాళ ఒక్క రోజే కర్నూలులో 27, కృష్ణాలో 14, గుంటూరులో 11 కేసులు బయటపడ్డాయి. అలాగే అనంతపురంలో 4, ప్రకాశంలో 3, తూర్పుగోదావరిలో 2, నెల్లూరులో ఒక పాజిటివ్ కేసు నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఇవాళ అనంతపురం, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. ఈ కేసులతో మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 955కి చేరాయి. ఇప్పటివరకూ కరోనాతో 29 మంది మృతి చెందగా.. 145 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 781 మంది.
Read More:
అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!
హైపర్ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!