కోవిడ్ చికిత్సల పేరుతో ప్రజలను దోచుకుతింటున్న పలు ప్రైవేటు ఆస్పత్రుల అరాచకాన్ని టీవీ9 ప్రత్యేక కథనాలను నిరంతరాయంగా అందించింది. కొన్ని ప్రయివేటు ఆస్పత్రుల ధన దాహానికి ఎన్నో కుటుంబాలు దారుణంగా నష్టపోయాయి. విచ్చలవిడిగా దోపిడీకి తెరలేపిన ప్రైవేటు వైద్యంపై నిగ్గుతేల్చింది. ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంతోపాటు జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న వరుస ఘటనలు వీటికి ఉదాహరణ నిలుస్తున్నాయి. కోవిడ్ బాధితులకు చికిత్సలు చేయాలంటే ముందుగా లక్షల రూపాయలు అడ్మిషన్ కింద చెల్లిస్తేనే హాస్పిటల్‌లో బెడ్‌లు కేటాయిస్తున్నారు. ఇలాంటి ఎన్నో కథనాలను నిత్యం వెలుగులోకి తీసుకొచ్చింది టీవీ9. కోవిడ్ పేరుతో ప్రయివేట్ హాస్పిటల్స్‌లో జరుగుతున్న దోపిడీని టీవీ9 ప్రత్యేక స్టోరీలను ప్రసారం చేసింది.. వెబ్ సైట్‌లో ప్రచూరించింది. టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దోపిడీకి అడ్రస్‌గా మారుతున్న ఆస్పత్రులపై వేటు వేసింది.
అధిక ఫీజులతో కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా ఝళిపించింది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది. ఆసుపత్రులపై వందల్లో ఫిర్యాదులు అందినట్లు చెప్పిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి దోపిడీ ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులు అందిన తర్వాత 24గంటల్లోపు సరైన వివరణ ఇవ్వాలని లేని పక్షంలో లైసెన్స్ కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఆసుపత్రుల లైసెన్స్ లు రద్దు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ ఎప్పట్లాగే కొనసాగుతోంది. లైసెన్సులు రద్దు చేసి నోటీసులు ఇచ్చినా కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం తమ తీరుని మార్చుకోవడం లేదు.