Coronavirus Third Wave: భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనావైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్‌పై భయాందోళనలు నెలకొన్నాయి. అయితే కరోనా థర్డ్ వేవ్ ముఖ్యంగా చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు పేర్కొనగా.. అదంతా ఉండదని మరికొన్ని అధ్యయనాలు సూచించాయి. ఈ తరుణంలో అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ వ్యాపిస్తుందని, చిన్నారులపై దీని ప్రభావం ఉంటుందని తాజాగా మరో సర్వే పేర్కొంది. సర్వే అనంతరం రాయ్ టర్స్ పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ప్రొఫెసర్లతో కూడిన 40 మంది ప్రొఫెషనల్స్ తో ఈ స్నాప్ సర్వేను నిర్వహించినట్లు రాయటర్స్ పేర్కొంది. ఆసుపత్రులు, ఆక్సిజన్, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండటంతో తదుపరి కరోనా వైరస్ వేవ్ ను మెరుగ్గా కట్టడి చేయవచ్చని ఈ సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది అభిప్రాయపడ్డారని పేర్కొంది.
సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది అక్టోబర్ లో భారత్ లో థర్డ్ వేవ్ తలెత్తుతుందంటూ పేర్కొన్నారు. అయితే.. ముగ్గురు మాత్రం ఆగస్టులోనే వస్తుందని చెప్పగా.. 12 మంది సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ ఉంటుందని అంచనా వేశారు. నవంబర్‌తోపాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు తదుపరి ఇన్ఫెక్షన్లు ఉంటాయని సర్వేలో పాల్గొన్నవారిలో ముగ్గురు పేర్కన్నారు. సర్వేలో పాల్గొన్న 40 మందిలో 26 మంది థర్డ్ వేవ్ 18 ఏండ్లలోపు వారిపై ప్రభావం చూపుతుందంటూ పేర్కొన్నారు. అయితే థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపదని 14 మంది వైద్య నిపుణులు స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతుండటంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉండవచ్చని ఈ సర్వేలో పాల్గొన్న ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతుండటంతో కేసులు తక్కువగా వస్తాయని.. దీంతో మహమ్మారి నియంత్రించడం తేలికగా మారుతుందని అన్నారు. సెకండ్ వేవ్ వ్యాప్తితో కొంతమేర సహజ రోగనిరోధకశక్తి సమకూరిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. కరోనా థర్డ్ వేవ్ ఉండదంటూ ఇటీవల పలువురు వైద్యనిపుణులు సూచించిన విషయం తెలిసిందే.
Also Read: