THIRD WAVE CORONA: దేశంలో థర్డ్ వేవ్ ఖాయమంటున్న వైద్య నిపుణులు.. ఎప్పుడు? ఎలా? ప్రభావంపై భిన్నాభిప్రాయాలు

|

May 20, 2021 | 1:54 PM

సెకెండ్ వేవ్ ఇక క్రమంగా తగ్గుముఖం పడుతుందన్న అంఛనాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతుంటే.. ఎంతో కొంత ఆశ చెలరేగుతుంది. కానీ అంతలోనే థర్డ్ వేవ్ కూడా దేశాన్ని ముంచెత్తడం ఖాయమని వైద్య నిపుణులు ప్రకటించడం ఆందోళన పెంచుతోంది.

THIRD WAVE CORONA: దేశంలో థర్డ్ వేవ్ ఖాయమంటున్న వైద్య నిపుణులు.. ఎప్పుడు? ఎలా? ప్రభావంపై భిన్నాభిప్రాయాలు
Follow us on

THIRD WAVE CORONA CONFIRM IN INDIA: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE)సృష్టిస్తున్న కలకలం, కలవరం అంతా ఇంతా కాదు. ఈ సెకెండ్ వేవ్ ఇక క్రమంగా తగ్గుముఖం పడుతుందన్న అంఛనాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతుంటే.. ఎంతో కొంత ఆశ చెలరేగుతుంది. కానీ అంతలోనే థర్డ్ వేవ్ కూడా దేశాన్ని ముంచెత్తడం ఖాయమని వైద్య నిపుణులు ప్రకటించడం ఆందోళన పెంచుతోంది. సెకెండ్ వేవ్ ఇంత భయంకరంగా వుంటే మరి థర్డ్ వేవ్ కూడా దేశాన్ని చుట్టుముడితే పరిస్థితి ఇంకెంత భయంకరంగా మారుతుందన్న భయాందోళనలు అప్పుడే మొదలయ్యాయి. ఈ క్రమంలో కొన్ని కీలకాంశాలు తెరమీదికి వస్తున్నాయి. దేశంలో మొదటి వేవ్ కరోనా (CORONA)ను సమర్థవంతంగానే ఎదుర్కొన్నాం. ప్రభుత్వాల అప్రమత్తత కావచ్చు.. జనంలో కరోనా అంటే భయం కావచ్చు.. మొత్తానికి గత సంవత్సరం విధించిన లాక్ డౌన్లు (LOCKDOWN) సత్ఫలితాలనే ఇచ్చాయి. 2020 సెప్టెంబర్ దాకా ఉధృతంగా కొనసాగిన కరోనా మొదటి వేవ్‌లో గరిష్టంగా ఒకరోజు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు (CORONA POSITIVE CASES) 97 వేలు మాత్రమే. కానీ సెకెండ్ వేవ్ అలా కాదు.. అనూహ్యంగా విరుచుకుపడి.. మార్చి రెండో వారం నుంచి దేశాన్ని ముంచెత్తింది. ఏప్రిల్ నెలలో ఉధృతమై.. మే నెలలో దేశమంతటా విస్తరించింది. మే నెల మొదటి వారం నుంచి రెండో వారం దాకా ప్రతీరోజు 3 నుంచి 4 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారం రోజుల పాటు ప్రతీ రోజు 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ప్రస్తుతం మే నెల మూడో వారంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు దిగువకు చేరింది. కానీ మరణాలు మాత్రం ఇంకా ఆందోళన కలిగిస్తూనే వున్నాయి.

దేశంలో ప్రతిరోజు మరణాలు 4 వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా మే 20వ తేదీన వెల్లడైన గణాంకాల ప్రకారం మరణాల సంఖ్య 4 వేలకు దిగువన చేరింది. ఇదొక ఆశావహ పరిణామమనే చెప్పాలి. ఈక్రమంలోనే దేశంలో సెకెండ్ వేవ్ కరోనా ఉధృతిని అంఛనా వేసేందుకు, తగిన కార్యాచరణ రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) ముగ్గురు శాస్త్రవేత్త (SCIENTIST)లతో కూడిన ఓ కమిటీని నియమించింది. ఇపుడీ కమిటీ కొంత ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఈ వార్తను పూర్తిగా శుభవార్త (GOOD NEWS) అని చెప్పలేం కానీ.. ఎంతో కొంత ఊరటనిచ్చే వార్తగా మాత్రం భావించవచ్చు. దేశంలో కరోనా మూడో వేవ్ త్వరలోనే ఉందని వారు వెల్లడించారు. అయితే థర్డ్‌ వేవ్‌ సెకెండ్ వేవ్ అంత దారుణంగా వుండకపోవచ్చని అంటున్నారు. కానీ థర్డ్ వేవ్‌లో మ్యూటెంట్ అయిన కరోనా బారిన పడిన వాళ్ళ పరిస్థితి రెండ్రోజుల్లోనే విషమించే అవకాశాలుంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ (CORONA VIRUS) వ్యాపిస్తున్న విధానం చూస్తుంటే థర్డ్ వేవ్ తప్పదని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా తాజాగా వెల్లడించింది. అయితే ప్రస్తుతం భారత్‌లో చాలా కరోనా వేరియంట్లు (CORONA VARIENTS) విజృంభిస్తున్నాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైనది డబుల్ మ్యూటెంట్ (DOUBLE MUTANT). దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు బి.1.617. అంతేకాకుండా మన దేశంలో పలు రాష్ట్రాల్లో వేరు వేరు వేరియంట్లు వెలుగు చూశాయి. ఈ వేరియంట్లు కరోనా కొత్త స్ట్రెయిన్లను సృష్టిస్తున్నాయని వైద్యులు చేసిన పరిశోధనలో తేలింది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. కరోనా ఫస్ట్‌ వేవ్‌లో మనుషుల ఊపిరితిత్తులను నాశనం చేయడానికి వైరస్ 10 రోజుల సమయం తీసుకుంది. సెకండ్ వేవ్‌లో ఈ కాలం 5 నుంచి 7 రోజులకు తగ్గిపోయింది. ఇక థర్డ్‌ వేవ్ వస్తే 2 నుంచి 3 రోజుల్లోనే ఈ వైరస్ ఊపిరితిత్తులను నాశనం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్ ప్రభావం, కరోనా వేవ్స్‌పై అధ్యయనం చేస్తున్న కొంత మంది శాస్త్రవేత్తలు మరో షాకింగ్ విషయం వెల్లడించారు. అదేంటంటే కరోనా మొదటి వేవ్‌లో వృద్ధులపై వైరస్ దాడి చేసింది. సెకండ్ వేవ్‌లో యువకులపై ఎక్కువ ప్రభావం పడింది. మూడో వేవ్ వస్తే మాత్రం ఇది పిల్లలను టార్గెట్ చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చిన్నారుల కోసం త్వరగా వ్యాక్సిన్ తయారు చేయకపోతే కరోనా థర్డ్‌ వేవ్‌ను తట్టుకోవడం కష్టమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకెండ్ వేవ్ జులై నాటికి అంతరిస్తుందని శాస్త్రవేత్తలు అంఛనా వేస్తున్నారు. ఆ తర్వాత 6 నుంచి 8 నెలల కాలంలో దేశంలో థర్డ్ వేవ్ కరోనా వైరస్ ఎంటరవుతుందని శాస్త్రవేత్తలు అంఛనా వేస్తున్నారు. అయితే సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా థర్డ్ వేవ్ వుండదని వారంటున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిధిలోని శాస్త్ర సాంకేతిక విభాగం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం పరిస్థితులపై అధ్యయనం నిర్వహించింది. ప్రస్తుతం కొనసాగుతున్న సెకెండ్ వేవ్‌లో మే నెలాఖరు నాటికి రోజువారి కేసులు లక్షన్నరకు పడిపోతాయని ఈ శాస్త్రవేత్తల బృందం అంఛనా వేస్తోంది. జూన్ నెలాఖరుకు ఈ సంఖ్య 20వేలకు పడిపోతుందని చెబుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్, గుజరాత్, హర్యానా, న్యూఢిల్లీ, గోవాల్లో కరోనా సెకెండ్ వేవ్ పీక్ లెవెల్‌కు చేరుకుందని అధ్యయనం తేల్చింది. ఇక పంజాబ్, తమిళనాడు, పుదుచ్ఛేరి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ సెకెండ్ వేవ్ మే 31 నాటికి తీవ్ర దశకు చేరుతుందని అంఛనా వేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలలో సెకెండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతుందని ఈ త్రిసభ్య కమిటీ తేల్చింది. థర్డ్ వేవ్ ప్రారంభమయ్యే నాటికి దేశంలో సగం జనాభాకు వ్యాక్సిన్ అందించడం.. మిగిలిన వారిలో ఆల్‌రెడీ యాంటీబాడీస్ డెవలప్ అయి వుంటాయి కాబట్టి మూడో వేవ్ ఉధృతి అంతగా వుండక పోవచ్చంటున్నారు. కానీ మ్యూటెంట్ అయ్యే కరోనా ఎలా విస్తరిస్తుందన్నది మాత్రం ఇంకా తెలియకపోవడం కాసింత ఆందోళన కలిగించే అంశమే.