Telangana Health Department : ఉద్యోగ అవసరాలపై విదేశాలకు వెళ్లే వారికి కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు తెలంగాణా ఆరోగ్య శాఖ ప్రకటించింది. విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారు పాస్ పోర్ట్, వర్క్ పర్మిట్ వీసా లను చూపించి ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా పొందవచ్చని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అర్హులైన వారికి కోవిషీల్డ్ టీకాలను 28 రోజుల వ్యవధిలో రెండు డోస్ లు ఇవ్వనున్నట్టు తెలిపింది. మొత్తంగా విదేశాలకు వెళ్లే ఉద్యోగస్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 టీకా కేంద్రాలను కేటాయించింది వైద్య ఆరోగ్య శాఖ.
ఇలా ఉండగా, విదేశాలకు వెళ్లే భారతీయుల పాస్‌పోర్టులను వ్యాక్సినషన్‌తో లింక్ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీన ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్య, ఉద్యోగం, టోక్యో ఒలింపిక్స్ సహా ఇతర పనుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు తమ కొవిన్ ఆధారిత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌కు తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే వీరిలో ఇప్పటికే తొలి డోసు తీసుకున్నవారు 28 రోజుల తర్వాత కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది.
విదేశాలకు వెళ్లే భారతీయులకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్‌ను ఈ సందర్భంగా కేంద్రం వెల్లడించింది. ఈ ప్రయాణాలు చేసే వారి కొవిన్ సర్టిఫికెట్లను సదరు వ్యక్తుల పాస్‌పోర్టులకు లింక్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని 84 రోజుల వరకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది.