కరోనాపై పోరులో టీ సర్కార్..‘వార్‌రూమ్’ వ్యూహం!

|

Jul 07, 2020 | 12:42 PM

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ప్రతి రోజు వెయ్యికి పైగానే కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 6,383 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 1831 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం

కరోనాపై పోరులో టీ సర్కార్..‘వార్‌రూమ్’ వ్యూహం!
Follow us on

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ప్రతి రోజు వెయ్యికి పైగానే కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 6,383 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 1831 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే, సోమవారం ఒక్క రోజే 11 మంది వైరస్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 25 వేలు దాటిపోగా.. కరోనా మరణాల సంఖ్య 300 దాటింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం దేశ రాజధాని ఢిల్లీలో అనుసరిస్తున్న విధానాన్నే తెలంగాణలోనూ అమలు చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం వైరస్ కట్టడి కోసం అనేక రకాలైన చర్యలు అమలు చేస్తోంది. కరోనా కంట్రోల్ కోసం ఢిల్లీ సచివాలయంలో 25 మంది నిపుణులతో వార్ రూమ్ ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. ఆ వార్ రూమ్‌ కేంద్రంగానే వైరస్ కట్టడికి సంబంధించి అధికారులు సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా టెస్టుల సంఖ్య భారీగా పెంచాలని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న బెడ్ల సంఖ్య, బాధితుల తాకిడిని బట్టి మరిన్ని ఏర్పాట్లు, మెడికల్ ఎక్విప్’మెంట్, అందుబాటులో ఉన్న అంబులెన్స్‌లు, కంటైన్‌మెంట్ జోన్లపై మొత్తం డాష్ బోర్డుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంటారు. కరోనాకు సంబంధించి భవిష్యత్ అవసరాలను కూడా వార్‌రూమ్ వేదికగా బృందాలకు సూచించనుంది. తద్వారా వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు కట్టడి చేయగలగుతామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా వార్‌రూమ్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలు, వారు ఎదుర్కొటున్న ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. ఆస్పత్రుల పరిస్థితులు, మందులు, కంటైన్‌మెంట్ జోన్లు సహా అన్ని అంశాలపై 24 గంటలు ఈ కంట్రోల్ రూమ్ ద్వారానే సమీక్షించనున్నారు.

ఇకపోతే, రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,733కి చేరింది. రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 306కి పెరిగింది. క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 14,781కి చేరగా, ప్ర‌స్తుతం 10,646 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే అత్య‌ధికంగా ‌గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 1419 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 160 మందికి, మేడ్చ‌ల్‌లో 117 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.