తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా చికిత్సలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఛార్జీల వసూలుపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. పలు ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది.
కరోనాకు సంబంధించి అధిక బిల్లులు వసూలు చేయడంపై నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. కరోనా టెస్ట్‌లు, ఛార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఎంత ఛార్జి వసూలు చేయాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ ఆస్పత్రులు పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావిస్తున్నట్లు హైకోర్టు విశ్వాసం వ్యక్తం చేసింది. ఒకవేళ ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో కోర్టుకు తెలపాలని, ఈ విషయమై ఈ నెల 14లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.