
కరోనా ధాటికి తమిళనాడు తల్లడిల్లిపోతోంది. వేగంగా విజృంభిస్తున్న వైరస్ కోరల్లో పడి ఆ రాష్ట్రం వణికిపోతోంది. సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఎవ్వరినీ వదలకుండా కరోనా వెంటాడి భయపెడుతోంది. ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్ బలగాన్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. కరోనా సోకిన మూడో రాజకీయ నాయకుడిగా మంత్రి నిలిచారు. ఇప్పటికే డీఎంకే ఎమ్మెల్యే జే అన్ బజాగాన్ కు కరోనా సోకడంతో చనిపోయారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే కే పళనికి కూడా కరోనా సోకింది. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. నార్త్ చెన్నై పరిధిలో ఈ కమిటీ పర్యవేక్షణ చేసింది. కరోనా నివారణ చర్యలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమీక్షలో పాల్గొన్న మిగతా వారికి కూడా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటికే వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.