కరోనాతో పనుల్లేక కిరాణా కొట్టు పెట్టుకున్న తమిళ దర్శకుడు

తమిళ దర్శకుడు ఆనంద్‌కు కూడా ఇప్పుడు చేతిలో పనుల్లేవు.. షూటింగ్ పనులు కానిద్దామంటే పర్మిషన్‌ లేదు.. ఇక చేసేదేమి లేక కిరాణాషాపు పెట్టుకున్నాడు....

  • Balu
  • Publish Date - 1:17 pm, Sat, 4 July 20
కరోనాతో పనుల్లేక కిరాణా కొట్టు పెట్టుకున్న తమిళ దర్శకుడు

Tamil Director Anand opens  store : కరోనా వైరస్‌ ప్రభావం అన్ని రంగాలపై పడింది.. సినిమారంగమూ ఇందుకు మినహాయింపు కాదు.. షూటింగ్‌లు లేక… చేసేందుకు పనుల్లేక చాలా మంది పస్తులుంటున్నారు.. ఆకలిదప్పులు తీర్చుకోవడానికి వేరే దారులు వెతుక్కుంటున్నారు.. కూడబెట్టుకున్నవారు కుదురుగానే ఉన్నారు.. లేనివాళ్ల పరిస్థితే కొంచెం కష్టంగా ఉంది..

తమిళ దర్శకుడు ఆనంద్‌కు కూడా ఇప్పుడు చేతిలో పనుల్లేవు.. షూటింగ్ పనులు కానిద్దామంటే పర్మిషన్‌ లేదు.. ఇక చేసేదేమి లేక కిరాణాషాపు పెట్టుకున్నాడు.. పదేళ్లుగా సినిమారంగంలో ఉంటూ వస్తున్న ఆనంద్‌ పరిస్థితే ఇలా ఉంటే నిన్నమొన్న పరిశ్రమలో అడుగుపెట్టినవారి పరిస్థితి ఎలా ఉందో..! ఓరు మజాయ్‌ నాంగు సారాల్‌, మౌనా మజాయ్‌ వంటి సినిమాలు ఆనంద్‌కు పేరును తెచ్చిపెట్టాయి.. ప్రస్తుతం తునింతు సీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.. రెండు మూడు పాటలు మినహా సినిమా దాదాపుగా కంప్లీట్ అయింది.. కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్న కారణంగా సినిమా థియేటర్లు ఓపెన్‌ అవ్వడానికి ఇంకా చాలా టైమ్‌ పడుతుంది..

సినిమా థియేటర్లు ఓపెన్‌ అయ్యాకే మళ్లీ ఇండస్ట్రీకి వస్తానంటున్నాడు ఆనంద్‌.. తన దగ్గర ఉన్న కాసింత డబ్బుతో చెన్నైలోని మౌలివాక్కంలో ఫ్రెండ్‌కు చెందిన ఓ షట్టర్‌ను కిరాయికి తీసుకున్న ఆనంద్‌ అక్కడో ఓ షాపు పెట్టుకున్నాడు. తమిళనాడులో కరోనా పరిస్థితి దారుణంగా ఉంది.. చెన్నైలో అయితే చెప్పనే అక్కర్లేదు.. కరోనాను కట్టడి చేయలేక మళ్లీ లాక్‌డౌన్‌ విధించుకోవలసి వచ్చింది.. అన్ని షాపులు క్లోజ్‌ అయ్యాయి.. కిరాణా షాపులకు మాత్రం పర్మిషన్‌ ఇచ్చింది సర్కార్‌.. అందుకే ఆనంద్‌ కూడా కిరాణా షాపు పెట్టుకున్నాడు. ప్రజలకు కావలసిన నిత్యావసరవస్తువులను తక్కువ ధరకే ఇస్తున్నాడు ఆనంద్‌.. అందుకే గిరాకీ కూడా బాగానే ఉంది.