Rajasthan Suspected Deaths: రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోవిడ్ 19 సోకిన మృతదేహనికి నిబంధనలు పాటించకుండా ఖననం చేసిన ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో చోటుచేసుకుంది. కాగా వీరిలో కరోనా వైరస్ కారణంగా నాలుగు మరణాలు మాత్రమే సంభవించినట్లు అధికారులు తెలిపారు. మిగతావారు వయోభారం కారణంగా చనిపోయినట్లు వెల్లడించారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆ గ్రామంలో అంతులోని విషాదాన్ని నింపింది.
ఏప్రిల్ 21న ఖేర్వా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా కాటుకు బలయ్యారు. దీంతో అతని మృతదేహన్ని గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ అంతిమ యాత్రలో సుమారు 150 మందికి పైగా బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా మృతదేహాన్ని ఖననం చేశారు. మృతదేహన్ని ప్లాస్టిక్ సంచిలో నుంచి బయటకు తీసినట్లు, ఖననం చేసే సమయంలో చాలా మంది దానిని తాకినట్లు స్థానికులు తెలిపారు. ఆ తర్వాత చాలా మంది బంధు మిత్రులు, గ్రామస్తులు కరోనా బారినపడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఒకరి తరువాత మరొకరు చొప్పున మొత్తం 21 మంది ప్రాణాలను కోల్పోయారు.
ఇదిలావుంటే, మొత్తం 21 మరణాలలో కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే కోవిడ్ 19 బారిన పడి చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు ఉన్నారని వారంత వయో భారంతో చనిపోయినట్లు వెల్లడించారు. కోవిడ్ 19తోనే మరణించారా? లేదా అని తెలుసుకునేందుకు తాము 147 కుటుంబాల నుండి శాంపిల్స్‌ను సేకరించినట్లు అధికారులు తెలిపారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో శానిటైజేషన్ డ్రైవ్‌ను చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామస్తులకు అవగాహన కల్పించి కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నామని జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది.