కరోనాను జయించిన కుటుంబం..అదే అసలు రహాస్యం?
ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ఆ కుటుంబంలో 15 మందికి కరోనా వచ్చింది. వారిలో 17 నెలల పాప నుంచి పండు ముసలి వరకు ఉన్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను వదిలేస్తున్న పిల్లలకు జ్ఞానోదయం కలిగించేలా ఉంది వీరి విజయం.

ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ఆ కుటుంబంలో 15 మందికి కరోనా వచ్చింది. వారిలో 17 నెలల పాప నుంచి పండు ముసలి వరకు ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో వారు కరోనాను జయించారు. ఒకరి ఒకరుగా..ధైర్యంగా నిలబడ్డారు. కరోనాఅంటే భయపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారికి.. మహమ్మారిని ఎదురించి నిలవాలని నిరూపించారు.
షాద్‌నగర్‌కు చెందిన అందె బాబయ్య కుటుంబం మొత్తానికి పాజిటివ్ వచ్చింది. అయినా వారు అధైర్య పడలేదు. ఆత్మవిశ్వాసంతో కరోనాను జయించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మనోధైర్యంతో మహమ్మారి నుంచి బయటపడవచ్చని నిరూపించింది అందె బాబయ్య కుటుంబం. కరోనా కారణంగా తల్లిదండ్రులను వదిలేస్తున్న పిల్లలకు జ్ఞానోదయం కలిగించేలా ఉంది వారి రియల్ స్టోరీ.
కుటుంబ సభ్యులందరికీ కరోనా వచ్చింది అనగానే భయమేసిందని చెప్పారు అందె బాబయ్య భార్య కిష్టమ్మ. వైరస్ వచ్చినవారు చాలా మంది చనిపోతున్నారని తెలియడంతో ఆందోళన చెందామన్నారు. దినం ఒక యుగంలా గడిచిందని చెప్పారు కిష్టమ్మ. పాజిటివ్ అనగానే ఇంటిపక్క వాళ్ళు తమ వైపు చూడటమే మానేశారని బాబయ్య కొడుకు రాజు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువుల సహకారం లేకుంటే చాలా ఇబ్బందిపడేవాళ్లమని చెప్పారు.
ఇంటి పెద్దయిన మామయ్యకు కూడా పాజిటివ్ అనగానే భయమేసిందన్నారు కోడలు మాధురి. హోంక్వారంటైన్‌లో ఉండి డాక్టర్ల గైడెన్స్‌తో కరోనా నుంచి బయటపడ్డామని ఆమె చెప్పారు. కరోనాను జయించడం అంటే భయాన్ని జయించడమే అన్నారు బాబయ్య కోడలు మాధురి. కాగా, హోంక్వారంటైన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఇంకో కోడలు లిశృత తెలిపారు. కషాయం, మొలకలు, యోగ, మెడిటేషన్ వంటివి వైరస్ నుంచి బయటపడటానికి బాగా ఉపయోగపడ్డాయన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరం పౌష్టికాహారం తీసుకున్నామని తెలిపారు లిశృత.
అయితే, ఇక్కడ బాబయ్య సోదరి ధైర్యం ప్రశంసనీయం. పాజిటివ్ ఉన్నవాళ్ల ఇంటికి ఎందుకు వెళ్తున్నావని చుట్టుపక్కల వాళ్లు వారిస్తున్నా… తాను భయపడలేదన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. జాగ్రత్తలు తీసుకుంటూ… పొరుగువారికి సాయం చేయడం తప్పేంటన్నారు బాబయ్య సోదరి. ఎవరి మాటలు లెక్కచేయకుండా తమవారికి అండగా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ కరోనా కష్టకాలంలో మనోధైర్యం కోల్పోకపోవటమే మందు అని నిరూపించారు షాద్‌నగర్‌లోని అందె బాబయ్య కుటుంబ సభ్యులు.




