రష్యా వ్యాక్సిన్ తయారీకి హెటిరో ఒప్పందం.. ఏటా 10 కోట్ల డోసుల ‘స్పుత్నిక్‌ వి’ టీకా అందించేందుకు డీల్..!

|

Nov 28, 2020 | 9:25 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు తొలిత వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు ప్రకటించుకుంది రష్యా. రష్యా అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా ‘స్పుత్నిక్‌ వి’ తయారీని హైదరాబాద్‌కు చెందిన హెటిరో గ్రూపు సంస్థ.. హెటిరో బయోఫార్మా చేపట్టనుంది.

రష్యా వ్యాక్సిన్ తయారీకి హెటిరో ఒప్పందం.. ఏటా 10 కోట్ల డోసుల ‘స్పుత్నిక్‌ వి’ టీకా అందించేందుకు డీల్..!
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు తొలిత వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు ప్రకటించుకుంది రష్యా. రష్యా అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా ‘స్పుత్నిక్‌ వి’ తయారీని హైదరాబాద్‌కు చెందిన హెటిరో గ్రూపు సంస్థ.. హెటిరో బయోఫార్మా చేపట్టనుంది. ఈ మేరకు రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, హెటిరో గ్రూపుల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఏటా 10 కోట్ల డోసుల స్పుత్నిక్‌ వి టీకా తయారీ చేయనున్నట్లు హెటిరో గ్రూపు వెల్లడించింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి టీకా తయారీ మొదలు పెట్టనున్నట్లు పేర్కొంది.

ఇప్పటివరకు నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల్లో ‘స్పుత్నిక్‌ వి’ టీకా 90 శాతానికి పైగా సామర్థ్యం కనబరచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ చెప్పుకుంటుంది. అయితే, ఈ టీకాపై ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్ బైలారస్‌, యూఏఈ, వెనెజులాతోపాటు మరికొన్ని దేశాల్లో జరుగుతున్నాయని రష్యా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి 120 కోట్ల డోసుల టీకా సరఫరా చేయాల్సిందిగా ఆర్‌డీఐఎఫ్‌కు విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తయారీ సామర్థ్యం పెంచుకోవడంలో భాగంగా హెటిరో సబయోఫార్మాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మనదేశంతో పాటు, బ్రెజిల్‌, చైనా, దక్షిణ కొరియా దేశాల్లోని తయారీదార్లతో ఆర్‌డీఐఎఫ్‌ ఒప్పందం కుదుర్చుకుంటోంది. నదేశంలో కొవిడ్‌-19 టీకా తయారైతేనే ప్రజలకు త్వరగా అందుబాటులోకి వస్తుందని, అందుకు తాము సన్నద్ధం అవుతున్నట్లు హెటిరో ల్యాబ్స్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారు. అయితే, స్పుత్నిక్‌ వి టీకాపై మనదేశంలో జరుగుతున్న క్లినికల్‌ పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని అన్నారు.

ఇదిలావుంటే ‘స్పుత్నిక్‌ వి’ టీకాపై మనదేశంలో రెండు, మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ నిర్వహిస్తోంది. మనదేశంలో ఈ టీకా తయారీ- విక్రయాలపై రెండు నెలల క్రితమే ఆర్‌డీఐఎఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ మధ్య డీల్ కుదిరింది. ఇందులో భాగంగా ఇక్కడ క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతిని డాక్టర్‌ రెడ్డీస్‌ కోరింది. ఇటీవల అనుమతి రావటంతో క్లినికల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల ఫలితాలు వచ్చే ఏడాది జనవరి నాటికి వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సానుకూల ఫలితాలు లభిస్తే, టీకా తయారీకి అనుమతి లభిస్తుంది. ప్రయోగ ఫలితాలను బట్టి డాక్టర్‌ రెడ్డీస్‌‌తోపాటు హెటిరో సంస్థ కూడా స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను తయారు చేయనున్నట్లు సమాచారం.