Covid 19: కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతున్నాయి.. సెప్టెంబర్ కల్లా పిల్లలకు కోవిడ్ టీకాలుః ఎయిమ్స్ చీఫ్ గులేరియా

|

Jul 24, 2021 | 11:37 AM

కరోనా మహమ్మారిలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశమున్న నేపథ్యంలో వాటి కట్టడికి బూస్టర్‌ డోసులు అవసరం పడే అవకాశముందని రణదీప్‌ గులేరియా అభిప్రాయపడ్డారు.

Covid 19: కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతున్నాయి.. సెప్టెంబర్ కల్లా పిల్లలకు కోవిడ్ టీకాలుః ఎయిమ్స్ చీఫ్ గులేరియా
Covid Vaccines Trails For Children
Follow us on

AIIMS chief Randeep Guleria Comments: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ విరుచుకునే అవకాశముందన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది వైద్య ఆరోగ్య శాఖ. మరోవైపు, సెప్టెంబర్ కల్లా పిల్లలకు కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా శనివారం వెల్లడించారు. పిల్లలకు వ్యాక్సిన్లు వేయడం వల్ల కరోనా ప్రసార చైన్ సిస్టమ్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ఉపయోగపడుతుందని డాక్టర్ గులేరియా తెలిపారు.

ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన.. జైడస్ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ చేసిందని, అత్యవసర అనుమతి కోసం జైడస్ వ్యాక్సిన్ కంపెనీ ఎదురుచూస్తుందని చెప్పారు. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాక్సిన్ ట్రయల్స్ ఆగస్టు, సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. ఫైజర్ వ్యాక్సిన్ ఇప్పటికే ఎఫ్‌డీఏ ఆమోదం పొందిందని గలేరియా తెలిపారు. భారతదేశంలో ఇప్పటివరకు 42 కోట్లకు పైగా ప్రజలకు వ్యాక్సిన్లు ఇచ్చామని, ఈ సంవత్సరం డిసెంబరు నాటికి పెద్దలందరికీ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డాక్టర్ వివరించారు. అనంతరం 18లోపు వారికి సైతం పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

కోవిడ్ -19 వ్యాక్సిన్ పరీక్షల కోసం జూన్ 7 న ఢిల్లీ ఎయిమ్స్ 2 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పిల్లలను పరీక్షించడం ప్రారంభించింది. మే 12 న, రెండు సంవత్సరాల వయస్సులోపు పిల్లలపై కోవాక్సిన్ రెండో దశ, మూడో దశ పరీక్షలను నిర్వహించడానికి డిసిజిఐ భారత్ బయోటెక్కు అనుమతి ఇచ్చింది. పిల్లలను వారి వయస్సు ప్రకారం వర్గాలుగా విభజించడం ద్వారా ఈ విచారణ జరుగుతుంది. ఇందులో ప్రతి వయస్సులోని 175 మంది పిల్లలు చేర్చబడ్డారు. రెండవ మోతాదు పూర్తయిన తర్వాత మధ్యంతర నివేదిక విడుదల చేస్తామని అయా ఔషధ సంస్థలు పేర్కొన్నాయి. తద్వారా పిల్లలకు టీకా ఎంత సురక్షితం అనేదీ స్పష్టం చేస్తుందన్నారు.

ఇదిలావుంటే, కరోనా మహమ్మారిలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశమున్న నేపథ్యంలో వాటి కట్టడికి బూస్టర్‌ డోసులు అవసరం పడే అవకాశముందని రణదీప్‌ గులేరియా అభిప్రాయపడ్డారు. కోవిడ్‌ కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి క్షీణిస్తున్న సమయంలో కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు.

‘‘ప్రస్తుతం చాలా మందిలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తూ వస్తోంది. అందువల్ల కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా మనకు బూస్టర్‌ డోసుల అవసరం ఉంది. రోగనిరోధక శక్తిని పెంచేలా, అన్ని రకాల కరోనా వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండే రెండో తరం టీకాలు రాబోతున్నాయి. ఇప్పటికే బూస్టర్‌ డోసులపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. బహుశా.. ఈ ఏడాది చివరి నాటికి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అయితే మొదట ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాతే ఈ బూస్టర్‌ డోసుల పంపిణీ ఉంటుంది’’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గులేరియా వివరించారు.

Read Also… Maharashtra Rains: మహారాష్ట్రలో కొనసాగుతున్న జలవిలయం.. వందల గ్రామాలకు రాకపోకలు బంద్.. వంద మందికి పైగా మృతి