అగ్రరాజ్యం అమెరికాపై కరోనా ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ప్రపంచంలో అత్యధిక వైరస్ పాజిటివ్ కేసులతో అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతోంది. రోజుకు వందల సంఖ్యలో మరణాలు, వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న క్రమంలో దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అమెరికాకు కొత్తగా మరో ముప్పు వచ్చి పడింది. ఓ కొత్త రకం అమీబా దేశాన్ని హడలెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే…
అమెరికాలోని ప్లోరిడాలో ఓ వ్యక్తి మెదడుకి సంబంధించిన వ్యాధితో అవస్థపడుతుండగా,..అతడికి చికిత్స చేసిన వైద్యులు భయంకర వాస్తవాన్ని బయటపెట్టారు. సదరు వ్యక్తికి అరుదైన, ప్రాణాంతక అమీబాతో ఈ ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు గుర్తించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ అమీబా సాధారణంగా సరస్సులు, నదులు, చెరువులు, కాలువల్లోని వెచ్చటి తాజా నీళ్లలో ఉంటుందని తెలిపారు. ఈ నీళ్లు ముక్కుకు తగలడం వలన ఈ అమీబా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. ఈ నీళ్లు ముక్కుకు తగలకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ఇది ఎక్కువగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే ఈ రకం అమీబా విస్తృతంగా వ్యాపిస్తుందని పేర్కొన్నారు.