
కరోనాపై పోరాటంలో ఇండియన్ రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పకే చాలా చోట్ల రైలు బోగీల్లో ఐసోలేషన్ సెంటర్లను ఆయా ప్రాంతాల్లో బాధితులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో ఆయా రాష్ట్రాలకు మరోమారు రైలు ఐసోలేషన్ బోగీలను తరలించింది రైల్వే శాఖ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ బోగీలను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
కరోనాను కట్టడి చేసేందుకు రైల్వే నాలుగు రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్‌లను ఏర్పాటు చేసింది. అందులో సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లలో 20 చొప్పున రాష్ట్రంలో మొత్తం 60 కోచ్‌లను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 20 కోచ్‌లు అందుబాటులో ఉంచింది. ఢిల్లీలోని శకుర్‌బస్తి రైల్వే స్టేషన్ మెయింటెనెన్స్ డిపోలో 54, యూపీలో 70 కోచ్ లు ఏర్పాటు చేసింది. ఢిల్లీలో విపరీతంగా కేసులు పెరుగుతున్న మేరకు మరో 500 ఐసోలేషన్ కోచ్‌లను అందుబాటులోకి తేనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.