AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండిగో విమానంలో కోవిడ్ పేషెంట్ కలకలం.. అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది.. శానిటైజ్ చేశాక టేక్-ఆఫ్ అయిన ఫ్లైట్

కరోనా బారిన పడ్డ ఓ ప్రయాణికుడు ఇండిగో విమానం ఎక్కేశాడు. విమానం టేక్-ఆఫ్ చేయడానికి ముందు తనకు కోవిడ్ పాజిటివ్ అని చెప్పాడు.

ఇండిగో విమానంలో కోవిడ్ పేషెంట్ కలకలం..  అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది.. శానిటైజ్ చేశాక టేక్-ఆఫ్ అయిన ఫ్లైట్
Balaraju Goud
|

Updated on: Mar 05, 2021 | 6:57 PM

Share

Passenger On IndiGo Flight : కరోనా బారిన పడ్డ ఓ ప్రయాణికుడు ఇండిగో విమానం ఎక్కేశాడు. విమానం టేక్-ఆఫ్ చేయడానికి ముందు తనకు కోవిడ్ పాజిటివ్ అని చెప్పాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది.. అతన్ని కిందకు దించి సీట్లను పూర్తిగా శానిటైజ్ చేశారు. సీటు కవర్లు సైతం మార్చిన అనంతరం ఫ్లైట్ తిరిగి ప్రయాణమైంది.

దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్.. తాను కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపాడు. అంతా సర్దుకుని ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో విషయం తాపీగా తెలిపాడు సదరు ప్రయాణికుడు. దీంతో ఒక్కసారిగా కంగారుపడ్డ ఫ్లైట్ సిబ్బంది. ప్రయాణీకుల భద్రత కోసం పైలట్ తిరిగి పార్కింగ్ బేకు వెళ్లమని కోరినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

ఇండిగో ఫ్లైట్ 6 ఇ -286 గురువారం ఢిల్లీ నుంచి పూణేకు టేకాఫ్ కోసం సిద్ధమవుతుండగా, ఆ వ్యక్తి క్యాబిన్ సిబ్బందికి తాను కోవిడ్ -19 పాజిటివ్ అని చెప్పి, దానిని నిరూపించడానికి పత్రాలను చూపించాడు. పైలట్ పరిస్థితి గురించి గ్రౌండ్ కంట్రోలర్‌లను రేడియోలో సమాచారం అందించాడు. తాను రన్‌బేకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీంతో వెంటనే అధికారులు అనుమతించారు.

దీంతో విమానంలోని ఇతర ప్రయాణికులను ఒక్కొక్కరిగా కిందకు దింపేశారు. సీట్లలోని ప్రయాణీకులు మొదట దిగి కోచ్‌లో వేచి ఉండాలని పైలట్ ఒక ప్రకటన చేశారు. కోవిడ్ 19 పాజిటివ్ ప్యాసింజర్ ఈ వరుసలలో ఒకదానిలో కూర్చున్నాడు. ఫ్లైట్ మళ్లీ బయలుదేరే ముందు సీట్లను పూర్తిగా శానిటైజ్డ్ చేశారు విమాన సిబ్బంది. అంతేకాదు, విమానంలో భద్రతా చర్యల్లో భాగంగా ప్రయాణికులందరికీ పీపీఈ కిట్లను అందజేసి సిబ్బంది, విమాన ప్రయాణం మొత్తం వ్యవధిలో వాటిని ధరించమని కోరినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ఈ విధంగా చేసినందుకు ప్రయాణికులు ఇండిగో ప్రయత్నాన్ని అభినందించారు. ఇక, కోవిడ్-19 పాజిటివ్ సోకిన సదరు ప్యాసింజర్‌ను దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని కోవిడ్ సెంటర్‌కు అంబులెన్స్‌లో పంపారు.

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న సమయంలో అన్ని రకాల రాకపోకలపై ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్ విధించడంతో అన్ని విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే, ఇటీవల కేంద్రం సడలింపులు ఇవ్వడంతో మెల్లమెల్లగా విమానాల రాకపోకలు మొదలయ్యాయి. పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు అనుసరించి విమానసర్వీసులను నడిపిస్తున్నారు. కాగా, తాజా ఘటనతో విమాన సిబ్బంది చూపిన చొరవకు ప్రయాణికులు అధికారులు అభినందనలు తెలిపారు.

Read Also….  Variety Thieves: వీళ్లు కొత్తరకం దొంగలు.. పెళ్లికి వస్తారు.. బహుమతులు కొట్టేస్తారు.. పక్కా స్కెచ్‌తో