
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. రోజుకు 50కి పైగా కేసులు అక్కడ నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటివరకు గ్రీన్ జోన్‌లో ఉన్న విజయనగరం జిల్లాలో సైతం ఇప్పుడు నాలుగు కేసులు ఉన్నాయి. కాగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ త్వరలో రాష్ట్ర ప్రజలు గుడ్ న్యూస్ వినబోతున్నారు. రాష్ట్రంలోని ఓ జిల్లా త్వరలోనే కరోనా ఫ్రీ జిల్లాగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఒక్క కేసు మాత్రమే ఉండటం విశేషం.
వివరాల్లోకి వెళ్తే.. ఒకానొక సమయంలో కరోనా కేసుల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ప్రకాశం జిల్లా ఉండగా.. ప్రస్తుతం అక్కడ కేవలం ఒక కేసు మాత్రమే ఉంది. అంతేకాదు గత వారం రోజులుగా అక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. కరోనా వచ్చినప్పటి నుంచి జిల్లాలో మొత్తం 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. గురువారం 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆ జిల్లాలో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 60కు చేరింది. ఇక ఒక వ్యక్తి మాత్రమే ఒంగోలులోని జీజీహెచ్‌లో చికిత్స తీసుకుండటంతో.. అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఆ జిల్లాలో ఒక్క మరణం కూడా నమోదు అవ్వకపోవడం సంతోషించాల్సిన మరో విషయం. జిల్లాలో కరోనా నియంత్రణ కోసం అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, వైద్యులు చేస్తున్న నిరంతర కృషి, వారి పనితీరును వల్లే ఈ మహమ్మారిని కట్టడి చేయగలిగారని జిల్లా ప్రజానీకం అభినందిస్తున్నారు.
Read This Story Also: లాక్‌డౌన్ ఎఫెక్ట్: పవన్ మూవీ వచ్చేది అప్పుడేనా..!