Vaccine Second Dose: యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉందని పరిశోధనల్లో తేలుతోన్న అంశాలు కాస్త సానుకూలంగా మారాయి. అయితే కొన్ని రోజుల క్రితం వరకు చాలా మందిలో వ్యాక్సినేషన్‌పై అనుమానాలు ఉన్నా.. ఇప్పుడిప్పుడే ఈ ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. తాజాగా 18 ఏళ్లు నిండిన వారు బారి ఎత్తున వ్యాక్సినేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడమే దీనికి ఉదాహరణ.
ఇదిలా ఉంటే కరోనా మొదటి డోసు తీసుకున్న కొందరికి సెకండ్ డోస్ అందడంలో కాస్త ఆలస్యమవుతోంది. దీంతో చాలా మంది భయాందోళనలకు గురవుతున్నారు. మొదటి డోస్ తీసుకొని ఆలస్యంగా సెకండ్ డోస్ తీసుకుంటే అది పనిచేయదేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. సెకండ్ డోస్ తీసుకోవడం ఆలస్యమైనా గాబరా పడొద్దని, ఆలస్యమైనా అది పనిచేస్తుందని, ఎవరూ వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండకూడదని చెప్పుకొచ్చారు. ఇక కోవిడ్ నుంచి కోలుకున్న వారు కూడా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన తెలిపారు. కోవిడ్ నుంచి కోలుకున్నరెండు వారాల తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే మెజార్టీ వైద్యులు మాత్రం లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిన తర్వాత 4-6 వారాల్లో తీసుకోవచ్చని చెబుతున్నారని వివరించారు.