Covid 19 Rules Breaks: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి వైద్యారోగ్య జారీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నా.. పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణలో రైతుబజార్లు, హోల్‌సేల్ మార్కెట్లలో కొవిడ్ జాగ్రత్తలు గాలికొదిలేస్తున్నారు. వినియోగదారులు కొంతవరకూ మాస్కులు ధరిస్తున్నా.. దుకాణదారులు అస్సలు పట్టించుకోవడం లేదు. గతంలో మాదిరిగా శానిటైజర్ల వినియోగం, థర్మల్ స్క్రీనింగ్ చేయడం ఎక్కడా కనిపించడం లేదు.
ఒక్క రోజులో నాలుగు లక్షల కేసులు. టెస్టుల సంఖ్య తగ్గుతున్నా.. కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినప్పటికీ పబ్లిక్‌లో పెద్దగా మార్పు రావడం లేదు. అయినా జనంలో భయం తగ్గుతోంది. ప్రమాదకరమైన వైరస్ ఇంకా ప్రమాదకరంగా విస్తరిస్తోందన్న స్పృహ లేదు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామంలో కోవిడ్ నిబంధనల్ని తుంగలో తొక్కారు మేకల సంత నిర్వాహకులు. కల్లూరులో ప్రతీ శనివారం జరిగే సంతకు చుట్టు పక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి భారీగా వ్యాపారులు తరలి వచ్చారు. సోషల్ డిస్టెన్స్ అనే మాటను పక్కన పెట్టి గుంపులు గుంపులుగా పోగయ్యారు. కొంతమంది అసలు మాస్కులు కూడా ధరించలేదు.
కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నామని చెబుతున్న పాలకులు, అధికారులు.. సంతలో జరుగుతున్న ఉల్లంఘనల్ని గాలికి వదిలేశారు. ఇలాంటి చోట ఒక్కరికి వైరస్ ఉన్నా.. అందరికీ వ్యాపిస్తుంది. ప్రస్తుతం దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి దశలో విస్తరిస్తోంది. ఇలాంటి సంతలు, ఈవెంట్ల వల్లనే కేసుల సంఖ్య అడ్డూ అదుపు లేకుండా పెరుగుతోంది. ప్రతి శనివారం సంత జరుగుతుందని తెలిసినా.. స్థానిక అధికారులు కానీ, పోలీసులు కానీ ఆ వైపు చూడలేదు. కోవిడ్ నిబందనల్ని కఠినంగా అమలు చేయాలని కోర్టులు పదే పదే చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు
తమిళనాడులోని మధురై జిల్లా తిరువతావూరులోనూ సేమ్ సీన్. సంప్రదాయబద్దంగా వస్తున్న చేపల వేట ఉత్సవంలో పాల్గొనేందుకు గ్రామస్తులంతా తట్టా బూట్టా సర్దుకుని ఊళ్లో ఉన్న చెరువులోకి పరుగులు పెట్టారు. భౌతిక దూరం మాట అటుంచితే.. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా మాస్క్ కూడా పెట్టుకోలేదు. మధురైలో ఇటీవల అళగర్ ఉత్సవాల్లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. పాలకులు, అధికారులు ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్న కొంతమంది తీరు మారడం లేదు. ఇలాంటి ఉత్సవాల వల్లే కరోనా సామాజిక వ్యాప్తి దశలో విస్తరిస్తోంది.
లాక్‌డౌన్ సమయంలో కూరగాయల కోసం జనం ఒక దగ్గరకి రాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కూరగాయలు, పండ్ల మార్కెట్లు ఏర్పాటు చేశారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా వాటి ముందు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మాస్కు లేనిదే సేవలు లేవనే బోర్డులు తగిలించారు. ఇప్పడు అవేవి అమల్లో లేకపోవడంతో జనం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
కరోనా తొలిదశలో ఒకరి నుంచి మరో ఇద్దరు ముగ్గురికి మాత్రమే వైరస్ వ్యాపించగా.. ప్రస్తుతం మాత్రం పదిమంది వరకు ప్రభావం చూపుతోంది. ఎక్కువ మంది గుమిగూడితే మరింత వేగంగా విస్తరించే అవకాశాలున్నాయి. కొందరి నిర్లక్ష్యం మరికొందరి శాపంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. పోలీసులు జరిమానాలు విధించినా.. అధికార యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మార్పు రావాల్సింది ప్రజల్లోనే. అందుకే ఎవరికి వారు బాధ్యతగా వ్యవహరిస్తేనే కరాళ నృత్యం చేస్తున్న కరోనా రక్కసికి సంకెళ్లు వేయగలుగుతామని నిపుణులు పేర్కొంటున్నారు.