నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా..కార్యాల‌యం మూసివేత‌

|

Apr 28, 2020 | 1:38 PM

భార‌త్‌లో క‌రోనా క‌రాళ‌నృత్యం చేస్తోంది. పార్ల‌మెంట్ భ‌వ‌న్‌, ఆరోగ్య శాఖ కార్యాల‌యం, ఎన్ ఐఏ, ఆఖ‌రుకు సుప్రీం కోర్టుకు కూడా పాకింది. తాజాగా నీతి ఆయోగ్ భ‌వ‌నాన్ని వైర‌స్ చుట్టుముట్టింది.

నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా..కార్యాల‌యం మూసివేత‌
Follow us on
భార‌త్‌లో క‌రోనా క‌రాళ‌నృత్యం చేస్తోంది. కోర‌లు చాస్తున్న కోవిడ్.. కొన్ని రాష్ట్రాల్లో బుస‌లు కొడుతోంది. దేశ‌రాజ‌ధాని హ‌స్తిన‌లో వైర‌స్ వ్యాప్తి మ‌రింత ఎక్కువ‌గా ఉంది. పార్ల‌మెంట్ భ‌వ‌న్‌, ఆరోగ్య శాఖ కార్యాల‌యం, ఎన్ ఐఏ, ఆఖ‌రుకు సుప్రీం కోర్టుకు కూడా పాకింది. తాజాగా నీతి ఆయోగ్ భ‌వ‌నాన్ని వైర‌స్ చుట్టుముట్టింది.
నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవనాన్ని మూసేశారు. తగిన జాగ్రత్త చర్యలు మ‌రింత ముమ్మ‌రం చేశారు. నీతి ఆయోగ్ భవనంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ మేర‌కు సంస్థ అధికారిక ట్విటర్ ద్వారా మంగళవారం (ఏప్రిల్ 28) వెల్లడించారు. ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు చేరవేసినట్లు సంబంధిత  అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తులందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలించినట్లు చెప్పారు.
మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 3108కి చేరింది. సోమవారం ఒక్క రోజే 190 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఇప్పటివరకూ 877 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 54 మంది మరణించారు. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఢిల్లీలో లాక్‌డౌన్‌కు సంబంధించి సోమవారం కొన్ని సడలింపులు ఇచ్చారు. ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, వెటర్నరీ డాక్టర్లపై ఆంక్షలు తొలగించారు.