కోవిడ్-19 ప్రపంచ దేశాల ఉమ్మడిగా శత్రువుగా మారింది. కంటికి కనిపించని మహ్మమారి బారినపడి పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. మందులేని వైరస్ భూతాన్ని అంతం చేయగల సరైన వ్యాక్సిన్‌ను కనుగొనే పనిలో ప్రపంచ శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాణాంతక వైరస్ ఎక్కడ పుట్టింది..ఎలా విస్తరిస్తోందనే అంశాలపై ఇంకా అనేక పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పలువురు సైంటిస్టులు తాజాగా చేపట్టిన అధ్యయనాలు మాత్రం మరో కొత్త విషయాన్ని వెల్లడించాయి. అసలు కరోనా వైరస్ ఇప్పుడు పుట్టింది కాదని, ఎన్నో యేళ్ల నుంచే ఆ వైరస్ గబ్బిలాల్లో ఉంటుందని తేల్చారు.
గబ్బిలాల్లో ఎన్నో దశాబ్దాలుగా గుర్తించకుండా కరోనా వైరస్ ఉంటున్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హార్స్ షు గబ్బిలాలు సార్స్ కోవ్-2 వైరస్‌లకు మూలమని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డైనమిక్స్‌కు చెందిన మాసిజ్ బోని నేతృత్వంలోని పరిశోధకులు తేల్చారు. ఈ అధ్యయనం నేచర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. కొన్ని దశాబ్దాల నుంచి గబ్బిలాల్లో ఈ వైరస్‌లు ఉంటున్నాయని వారు తేల్చారు. ‘వైరస్ వంశాన్ని గుర్తించడం వల్ల, వాటి నుంచి మనుషులకు సోకకుండా జాగ్రత్త పడొచ్చని’ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో శాస్త్రవేత్తలు వైరస్ మూలాన్ని గుర్తించే పనిలో పడ్డారు.
అసలు ఈ కరోనా ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? మూలాలు ఏంటని చాలా మంది శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. గబ్బిలాలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని యూఎస్ ప్రభుత్వ అధికారులు ఆరోపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ నెలలో దీనిని అధ్యయనం చేసేందుకు నిపుణులను చైనాకు పంపింది. ఈ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఎంతోమంది పరిశోధకులు కూడా పలు కోణాల్లో అధ్యయనం చేస్తున్నారు. గబ్బిలాల నుంచే ఆ వైరస్ మనుషులకు వ్యాప్తి చెంది ఉంటుందని, అలాగే వాటి నుంచే పంగోలిన్లకు కూడా వైరస్ సంక్రమించి ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.