తాచెడ్డ కోతి వనమెల్లా చెడచినట్టు.. తనకంటుకున్న కరోనా వైరస్‌ను పదిమందికి అంటించాలనుకున్నాడో ఏమో కానీ ఐసోలేషన్ సెంటర్ నుంచి దొంగచాటుగా సూపర్‌మార్కెట్‌కు వెళ్లొచ్చాడో పెద్దమనిషి.. ఇక్కడంటే ఇలాంటివి చెల్లుతాయి కానీ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో చెల్లవు కదా! అతగాడిని ఊరికే వదిలేట్టులేరు అక్కడి అధికారులు. విషయమేమిటంటే ఢిల్లీ నుంచి మొన్నీమధ్యనే అంటే జులై 3న ఆక్లాండ్‌కు వచ్చిన 32 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. వెంటనే అతడిని ఆక్లాండ్‌లోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు..
తిరిగే కాలు ఊరకుండదు కదా! ఐసోలేషన్ సెంటర్ ఫెన్సింగ్‌ను దాటుకుని మరీ ఓ సూపర్‌మార్కెట్‌కు వెళ్లాడు.. సడన్‌గా ఐసోలేషన్ సెంటర్ నుంచి మనిషి అదృశ్యం కావడంతో అధికారులు బెంబేలెత్తిపోయారు. ఆరోగ్యమంత్రి క్రిస్ హిప్కిన్స్ అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు.. అతడు మామూలు తప్పు చేయలేదని, స్వార్థపూరితంగా వ్యవహరించాడని, అతడిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారాయన. సూపర్‌మార్కెట్‌లో 20 నిమిషాలసేపు గడిపిన అతగాడు ఓ గంట తర్వాత తీరిగ్గా స్వయంగా ఐసోలేషన్ సెంటర్‌కు చేరుకున్నాడు..
ఇలా ఐసోలేషన్ సెంటర్ నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లినందుకు ఆరు నెలల జైలు శిక్ష కాని, 2.8 లక్షల రూపాయల జరిమానా కాని విధిస్తారని అక్కడి స్థానిక పేపర్ న్యూజిలాండ్ హెరాల్డ్ తెలిపింది. ఇదిలా ఉంటే కరోనా సోకిన వ్యక్తి తమ స్టోర్‌కు వచ్చాడని తెలియడంతో సూపర్‌మార్కెట్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.. వెంటనే వారంతా హోమ్ క్వారంటైన్‌కు వెళ్లారు.. ఇప్పుడు వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. న్యూజిలాండ్‌లో ఇప్పటివరకూ 1,187 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స తీసుకుంటున్నారు.