Get Covid Vaccine Win Prizes: విశ్వవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రపంచం నలుమూలలా వైరస్ మహావిస్ఫోటనం కనిపిస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో శాంపిల్ మాత్రమే చూపించిన కోవిడ్.. సెకండ్ వేవ్‌లో మహావిలయం సృష్టిస్తోంది. రోజుకు దాదాపు లక్షల కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతిదీ గండంగానే మారింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరేవాళ్లకు బెడ్లు దొరకడం లేదు. కొన్నిచోట్ల ఆక్సిజన్ కొరత ఉంది.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా పంపిణీ వేగవంతం చేసింది ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సంకల్పంతో అందరికి అవగాహన కల్పిస్తోంది.కొన్ని చోట్ల వ్యాక్సిన్ కోసం జనం క్యూ కడుతున్నారు. మరి కొన్ని టీకా తీసుకునేందుకు జనం ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ‘‘కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి. లేదంటే ఉద్యోగం పోతుంది’’ అంటూ పలు దేశాలు ఇప్పటికే కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ర్టలో ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ కూడా సరిగ్గా ఇదే తరహా ఆంక్షలను అమలు చేస్తోంది. కానీ, మహారాష్ర్టలోని చంద్రాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం వీటికి భిన్నంగా స్పందించింది. అక్కడి మేయర్ రాఖీ సంజయ్ కంచరల్వార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొన్నారు. టీకాలు తీసుకొన్న పౌరులకు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించారు. దీంతో అక్కడ టీకా వేయించుకొన్న వారి పేర్లను లక్కీడ్రా తీసి విజేతలకు బహుమతులను అందజేయాలని నిర్ణయించారు.
నవంబరు 12 నండి 24 వరకూ కరోనా టీకా తీసుకునే వారికి వీటిని గెలుచుకునే అవకాశం ఉన్నట్లు బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు పౌరులు తమ సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టీకాలు వేయించుకోవాలని కమిషనర్ రాజేష్ మోహితే విజ్ఞప్తి చేశారు. ఇక, లక్కీ డ్రాలో తొలి బహుమతిగా రిఫ్రిజిరేటర్, రెండో బహుమతిగా వాషింగ్ మిషన్, మూడో బహుమతిగా ఎల్‌ఈడీ టీవీ ఇస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు మరో 10 మందికి మిక్సర్-గ్రైండర్లను ప్రోత్సాహక బహుమతులుగా ఇవ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు.
అత్యవసర సేవల విభాగంలో పని చేసేవారితో పాటు దుకాణదారులు కచ్చితంగా ఒక డోస్ టీకా తీసుకున్నట్లు సర్టిఫికేట్‌ను చూపించాల్సి ఉంటుందని మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది. లేదంటే వారిని నగరంలోని మార్కెట్‌ల్లోకి అనుమతించమని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 30లోపు వారు టీకా రెండుడోసులను కచ్చితంగా తీసుకోవాలి. అలాగే, బయటికి వచ్చేటప్పుడు వారి వెంట వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలని కమిషనర్ మోహితే విజ్ఞప్తి చేశారు.
ఇదిలావుంటే, టీకా పంపిణీలో భారత్మరో ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక మందికి వ్యాక్సినేషన్చేసిన దేశంగా భారత్ అగ్రస్థానంలో ఉంది.. కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంగా వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేస్తున్నాయి.. మరోవైపు భారత్‌లో కరోనా రికవరీ రేటు 97 శాతానికి చేరువలోకి రాగా దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం ఉపశమనం కలిగిస్తోంది.
Read Also…. Health: ఈ సమస్యలున్న వారు అస్సలు ఉసిరి తినకూడదు.. పొరపాటున తిన్నారో మొదటికే మోసం..