దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిపై పోరాట౦ చేయడానికి గానూ వైద్య పరికరాల అవసరం చాలా ఉంది. ప్రధానంగా చెప్పుకోవాలి అంటే కరోనా వైరస్ మహమ్మారితో పోరాడటానికి అవసరమైన పరికరాలలో కీలకం వెంటిలేటర్లు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో తయారు చేసిన వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి.
పలు రాష్ట్రాల్లో కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులకు తొలి విడతగా 3,000 దేశీయ వెంటిలేటర్లను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ స్కాన్‌రేతో కలిసి 30 వేల వెంటిలేటర్లను తయారు చేస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు ఇతర దేశీయ సంస్థలైన ఏజీవీఏకు 10 వేలు, ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు 13,500, జ్యోతి సీఎన్‌సీకి 5 వేల వెంటిలేటర్ల చొప్పున ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం 50 వేల వెంటిలేటర్ల కొనుగోలుకు పీఎంకేర్స్ నిధి నుంచి సుమారు రెండు వేల కోట్లు ఖర్చుచేస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.