Largest Vaccine Drive: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిలోభాగంగా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కోవిడ్ డోసులను పంపణీ చేస్తున్నారు. తాజగా గత 24 గంటల్లో రెండు మిలియన్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. (సోమవారం నుంచి మంగళవారం వరకు ) 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 20,19,723 కోవిడ్ డోసులను వేసినట్లు పేర్కొంది. టీకా అందుబాటులోకి వచ్చిన అనంతరం ఒకేరోజు ఈ ఇన్ని డోసులు ఇవ్వడం ఇదే మొదటిసారని కేంద్రం తెలిపింది. వీటితో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,30,08,733 వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ముందుగా జనవరి 16న దేశంలో కరోనావైరస్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటివిడుతలో భాగంగా ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు టీకాను పంపిణీ చేశారు. అనంతరం మార్చి ఒకటో తేదీ నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా 60ఏళ్లు పైబడినవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. జులై నాటికి దాదాపు 30కోట్ల మందికి టీకా ఇచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తోంది.
ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 1.89 కోట్ల మందికి తొలి డోసు అందించారు. మరో 40. 65లక్షల మందికి రెండు డోసు ఇచ్చారు. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లో ఇప్పటివరకు 23 లక్షల డోసులను అందించగా, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 19 లక్షల చొప్పున వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇదిలాఉంటే.. మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య కూడా నిత్యం పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,388 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాగా.. ఈ మహమ్మారి కారణంగా 77 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,44,786కకు చేరగా.. మరణాల సంఖ్య 1,57,930కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,87,462 యాక్టివ్ కేసులున్నాయి.
Also Read: