గత ఆరు నెలలుగా ప‌్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని దేశాలను వణికిస్తోంది. భారత్‌లో కోరలు చాస్తోన్న కోవిడ్ దెబ్బకు అన్ని రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా స్వైర విహారం చేస్తుండగా, తాజాగా మరో రెండు రాష్ట్రాల్లోనూ వైరస్ వ్యాప్తి, పాజిటివ్ కేసులు భయాందోళనకు గురిచేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, కర్నాటకలు కరోనా తదుపరి హాట్‌స్పాట్‌లుగా మారుతున్నట్లు పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో పాజిటివ్ రేటింగ్ మహారాష్ట్రను మించిపోయినట్లుగా ఇటీవల ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. దీంతో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తరువాత తెలంగాణలో అత్యధిక కరోనా కేసులు బయటపడుతున్నాయి. గత రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగింది. ప్రతిరోజూ సగటున 1,219 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27వేల మార్క్‌ను దాటేసింది. కరోనా టెస్టుల విషయంలోనూ తెలంగాణ వెనుకబడి ఉంది. కరోనా కేసుల విషయంలో తెలంగాణ తరువాతి స్థానంలో కర్నాటక నిలిచింది. ఈ రాష్ట్రంలో మంగళవారం నాటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,317గా ఉంది. గత రెండు వారాల్లో కర్నాటకలో ప్రతిరోజూ 1,137 కొత్త కేసులు నమోదవుతున్నాయి.