
బ్రిటన్ నుంచి ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, బ్రిటన్ నుంచి కడప జిల్లాకు ఈ మధ్య కాలంలో 24 మంది వచ్చినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. వారిని గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ 24 మందిలో కడప జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురిని, ప్రొద్దుటూరుకు చెందిన నలుగురిని గుర్తించినట్లు సమాచారం. మిగితా ప్రయాణికుల వివరాలను తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే బ్రిటన్ నుంచి వచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వైద్యాధికారులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.