Jharkhand CM Hemant Soren writes to PM Narendra Modi: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్ని వయస్సుల వారికి వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా కోవిడ్ టీకాల కొరత, పలు అంశాలపై హేమంత్ సోరెన్ ప్రస్తావించారు. జార్ఖండ్ రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి కోవిడ్ టీకాలు వేసేందుకు 1,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, రాష్ట్రం ఇంత మొత్తాన్ని భరించే పరిస్థితిలో లేదని సీఎం సోరెన్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో వివరించారు. కావున 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవారికి కూడా కేంద్రమే టీకాలు వేయాలని కోరారు. పరిమిత వనరులతో తాము కరోనాతో పోరాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 1.57 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు అదనంగా టీకాలు పంపించాలని సీఎం ప్రధానిని కోరారు. దీంతో పాటు 12 నుంచి 18 ఏళ్ల వయసు గల పిల్లలకు టీకాలు వేయాలంటే మరో వెయ్యి కోట్లరూపాయలు అవసరమని సీఎం వివరించారు. తమ రాష్ట్రానికి సకాలంలో కోవిడ్ టీకాలు పంపించి సహకరించాలని సీఎం హేమంత్ సోరెన్ ప్రధానికి విన్నవించారు.
అయితే.. అంతకుముందు కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేంద్రంపై పలుమార్లు విమర్శలు వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కేంద్రం నుంచి సరిపడా టీకా డోసులు రావడం లేదని సోరెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇది పెద్ద అవరోధంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రాలే తమ సొంతంగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేయడం భారత చరిత్రలో ఇదే తొలిసారని సోరెన్ అభిప్రాయపడ్డారు. యావత్తు దేశం కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న సమయంలో టీకాల సమీకరణ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టడం ఎంతవరకు సమంజసమంటూ విమర్శించారు.
Also Read: