Covid-19 Updates in India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతుండగా.. వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. కాగా గత మూడు రోజులతో పోల్చుకుంటే.. కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. మొన్నటి దాకా నాలుగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం 3.60లక్షల కేసులు నమోదు కాగా.. సోమవారం 3.30లక్షలకు దిగువన కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసుల తగ్గుదల కొంచెం ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో (సోమవారం) 3,29,942 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 3,876 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,92,517 కు పెరగగా.. మొత్తం మరణాల సంఖ్య 2,49,992 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
నిన్న కరోనా నుంచి 3,56,082 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 1,90,27,304 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 37,15,221 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. సోమవారం దేశవ్యాప్తంగా 18,50,110 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 30.56 కోట్లకుపైగా టెస్టులు చేసినట్లు వెల్లడించింది.
ఇదిలాఉంటే.. దేశంలో టీకా డ్రైవ్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. సోమవారం నాటికి 115వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 17,27,10,066 డోసులు వేసినట్లు పేర్కొంది.
Also Read: