India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలను కూడా విధించాయి. ఈ క్రమంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. రేపటినుంచి రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. వృద్ధులకు వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు శనివారం ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం, ఆదివారం వ్యాక్సిన్ డ్రైవ్‌కు స్వల్ప విరామం ప్రకటిస్తూ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 1,43,01,266 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
కాగా.. గత 24గంటల్లో (శనివారం) దేశవ్యాప్తంగా 16,752 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,96,731 (1.10కోట్లు) కు పెరిగింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 113 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,57,051 కు చేరింది. కాగా.. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. నిన్న కరోనా నుంచి 11,718 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. వీరితో కలిపి ఇప్పటివరకు 1,07,75,169 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,64,511 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే దేశంలో మళ్లీ యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.10 శాతం ఉండగా.. మరణాల రేటు 1.42 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,95,723 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మొత్తం 21,62,31,106 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.
Also Read: