ఇండియాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు అదుపులోనే ఉంటున్నాయి. కొత్తగా గురువారం 19,29,476 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 62,480 కరోనా బారినపడ్డట్లు తేలింది. క్రితం రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. కాగా 24 గంటల వ్యవధిలో మరో 1,587 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. మరణాల సంఖ్య తగ్గడం కాస్త ఊరటనిచ్చే విషయం. మరో 88,977 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,98,656 యాక్టివ్ కేసులున్నాయి. కాగా 73 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు 8 లక్షల దిగువకు వచ్చాయి. క్రియాశీల రేటు 2.78 శాతానికి చేరగా.. రికవరీ రేటు 95.93 శాతానికి పెరిగింది. కాగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 32,59,003 వ్యాక్సిన్ అందించారు. ఇప్పటివరకు మొత్తం వ్యాక్సిన్ వేయించుకునవారి సంఖ్య 26,89,60,399 కు చేరింది.
దేశంలో మొత్తం కరోనా కేసులు: 2,97,62,793
మొత్తం రికవరీలు: 2,85,80,647
మొత్తం మరణాల సంఖ్య : 3,83,490
కరోనా థర్డ్ వేవ్ వచ్చినా.. అది చిన్నారులపై ప్రభావం చూపే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ), ఎయిమ్స్ సంయుక్త అధ్యయనం స్పష్టం చేసింది. చిన్నారులు, వయోజనుల్లో సీరో పాజిటివిటీ రేటు.. కాస్త దగ్గరగా ఒకే స్ధాయిలో ఉందని వెల్లడించింది. ఈ అధ్యయనంలో భాగంగా.. ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్10 మధ్య దేశంలోని అయిదు ప్రాంతాల్లో రెండేళ్ల వయసు నుంచి వయోజనుల వరకు…. 4 వేల 59 శాంపిల్స్ సేకరించారు. పూర్తి స్ధాయి అధ్యయనం ఇంకా కొనసాగుతున్నా.. ఇప్పటి వరకు గుర్తించిన వివరాలను నిపుణులు వెల్లడించారు. సీరో పాజిటివిటీ రేటు 18 ఏళ్ల లోపు వారిలో 55.7శాతం, అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో.. 63.5శాతం ఉందని వివరించారు. ఇన్నాళ్లూ వయోజనుల స్థాయిలోనే పిల్లల్లోనూ కరోనా ప్రభావం చూపిందని దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే.. ప్రత్యేకంగా చిన్నారుల్లో ప్రభావం చూపిస్తుందనే ఆందోళన అవసరం లేదని తెలిపారు.