Black fungus Medicine Fraud: ఓవైపు కరోనా కష్ట కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు మోసగాళ్లు ఇదే అదునుగా మోసాలకు తెగబడుతున్నారు. కరోనా చికిత్స పేరిట ఆన్‌లైన్‌లో భారీ ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్ చికిత్స పేరుతో సైబరాబాద్ పరిధిలో ఇలాంటి మోసాలే వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు పోలీసులు..
తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే మెడిసిన్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాడు. ఇందులో భాగంగా ఇండియా మార్ట్ వెబ్‌సైట్‌లో ఓ వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ లభించింది. అనంతరం వాట్సాప్ ద్వారా సదరు వ్యక్తిని అప్రోచ్ కాగా.. విమానం ద్వారా బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను పంపిస్తానని ఇందుకోసం 60 ఇంజెక్షన్లను గాను రూ. 8,32,300 పంపించమని అడిగాడు. సదరు వ్యక్తి చెప్పిన అకౌంట్ నెంబర్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేశాడు. తీరా డబ్బులు వెళ్లిన తర్వాత ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం ఆపేశాడు. దీంతో బ్లాక్ ఫంగస్ కోసం ప్రయత్నించిన సదరు హైదరాబాద్ వాసి మోసాపోయానని ఆలస్యంగా తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆన్‌లైన్ వేదికగా జరుగుతోన్న మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ క్రమంలోనే పలు సూచనలు చేశారు. అవేంటంటే..
* సోషల్ మీడియా వేదికగా మెడిసిన్ అందుబాటులో ఉంది అంటూ చేస్తోన్న పోస్టులను గుడ్డిగా నమ్మకూడదని తెలిపారు.
* గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కోవిడ్ సంబంధిత మందులను కొనుగోలు చేయకూడదు.
* కోవిడ్ సంబంధిత మెడిసిన్‌కు సంబంధించి సందేహాలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన dme@telangana.gov.in మెయిల్‌కు పంపించాలి.
* ఇండియా మార్ట్, ఓఎల్ఎక్స్, క్విక్కర్ వంటి వెబ్‌సైట్లలో ప్రకటనలను తొందరపడి నమ్మకూడదు.
Also Read: Manchu Vishnu: కూతురు విసిరిన ఛాలెంజ్ కోసం మంచు విష్ణు చేసిన పనికి షాక్ అయిన మోహన్ బాబు..