
ఏపీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్న వైరస్ ప్రకంపనలు రేపుతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డులు బ్రేక్ చేస్తూ.. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా టెస్టులు భారీగా నిర్వహిస్తుండగా.. కేసుల సంఖ్య కూడా అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. మరోవైపు విజయవాడలోనూ కరోనా పంజా విసురుతోంది. దీంతో అధికారులు పలు చోట్ల ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు.
విజయవాడ పట్టణ పరిధిలో వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా కొనసాగుతోంది. ఇప్పటికీ పట్టణంలో చాలా ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లలో ఉన్నాయి. కానీ, వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో అధికారులు విజయవాడలో 11 ప్రాంతాల్లో వారం పాటూ ఆంక్షలు విధించారు. విజయవాడ పట్టణ పరిధిలోని పటమట, కృష్ణలంక, కొత్తపేట, మొగల్రాజపురం, విద్యాధరపురం, అజిత్‌సింగ్ నగర్, భవానీపురం, చుట్టుగుంట, సత్యనారాయణపురం, వించిపేట, చిట్టినగర్ ప్రాంతాల్లో వారం రోజుల పాటూ కఠినంగా ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఆయా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. నిత్యావసరాలు, మెడికల్ షాపులకు ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు. మరోవైపు కంటైన్మెంట్ జోన్లలో కరోనా టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని నిర్ణయించారు. పనులపై బయటకు వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్, పల్స్ టెస్టులు నిర్వహించనున్నారు. బారీకేడ్లతో రాకపోకల నియంత్రణ, కోవిడ్ జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేయనున్నారు.