సినిమా పరిశ్రమకు త్వరలోనే తీపి కబురు అందనుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన షూటింగ్‌ను తిరిగి ప్రారంభించుకునేందుకు అవసరమైన మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు. ముంబైలో జరిగిన ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియాన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ స్ట్రీ (ఫిక్కీ) 21 వ వార్షిక సమావేశాలకు మంత్రి హాజరయ్యారు. ఈ సమావేశాలను కరోనా కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జావదేకర్ పలు కీలక అంశాలను వెల్లడించారు.
త్వరలోనే సినిమా, టీవీ, గేమింగ్ వంటి విభాగాలకు వేర్వేరు మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రకటించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు ఉందని అన్నారు. ఇక్కడ చిత్రీకరించిన సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు మరిన్ని పెరిగితే మరింత వేగంగా దూసుకుపోతుందని అన్నారు. దీని ద్వారా సీరియల్, రియాలిటీ షోస్, కో ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారు తిరిగి ఉపాధి పొందే అవకాశం ఉంది.