కరోనా వైరస్ విలయతాండవం చేయటంతో మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కొన్నిచోట్ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించటానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. అంతేకాదు.. డెడ్‌బాడీలు అప్పగించే విషయంలో కూడా ఆస్పత్రుల నిర్లక్ష్య ధోరణి బయటపడుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనాతో చనిపోయిన మృతదేహాలు తారుమారు కావటంతో ఒకరికి బదులు ఇంకోకరికి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఇరువర్గాల వారు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అమలాపురంలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఘటన చోటు చేసుకుంది. కరోనాతో మృతిచెందిన వ్యక్తి డెడ్‌బాడీని వారి కుటుంబ సభ్యులకు కాకుండా, మరొకరికి ఇవ్వటంతో..వారు అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోవైపు అంత్యక్రియలు జరిపిన మృతదేహనికి సంబంధించిన బంధువులు, కుటుంబీకులు విషయం తెలుసుకుని ఆస్పత్రి ఎదుట దర్నాకు దిగారు. ఇరువర్గాల బంధువులు, కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దహన సంస్కారాలు పూర్తి చేసిన మృతదేహం తరపువారు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం పోలీసులకు చేరటంతో…ఘటనా స్థలానికి చేరుకున్న వివరాలు సేకరించి ఇరువురికి నచ్చజెప్పి పరిస్థితి చక్కదిద్దారు.