తెలంగాణలో వైరస్ తగ్గుముఖం పట్టినట్లుగానే కనిపిస్తోంది. బుధవారం కేవలం రాష్ట్రంలో కొత్తగా ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడు కేసులు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధికి చెందినవిగా అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. వైరస్ బారిన పడి 25 మంది మరణించారు. కాగా బుధవారం రోజున 14 మంది చిన్నారులు సహా, 35 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పలు జిల్లాల్ని కరోనా ఫ్రీ జిల్లాలుగా ప్రకటించింది రాష్ట్ర ఆరోగ్యశాఖ. కరోనా పాజిటివ్ ఆక్టివ్ కేసులు లేకుండా ఉన్న జిల్లాలు 11 ఉన్నట్లు వెల్లడించారు. కరోనా ఫ్రీ జిల్లాలుగా సిద్దిపేట, మతహబూబాబాద్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ములుగు జిల్లాల్లో కరోనా ఆక్టివ్ కేసులు లేకుండా ఉన్నాయి. ఈ జిల్లాలో కరోనా సోకిన వారందరూ చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు చేరినట్లుగా అధికారులు వెల్లడించారు.