Covid Vaccination: దేశవ్యాప్తంగా టీకా టెన్షన్.. 40 రోజుల్లో సగానికి పడిపోయిన వ్యాక్సినేషన్.. ప్రజలందరికీ అందేదెప్పుడు..?

|

May 22, 2021 | 12:58 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్ నియంత్రణకు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు

Covid Vaccination: దేశవ్యాప్తంగా టీకా టెన్షన్.. 40 రోజుల్లో సగానికి పడిపోయిన వ్యాక్సినేషన్.. ప్రజలందరికీ అందేదెప్పుడు..?
Covid 19 Vaccination
Follow us on

Covid 19 Vaccination in India: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా భారత్‌లో సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. వైరస్ నియంత్రణకు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరిలోనే వ్యాక్సిన్ల పంపిణీ ప్రారంభమైంది. ప్రారంభంలో దశల వారీగా టీకాలు ఇచ్చారు. అప్పట్లో టీకాల పంపిణీ కూడా సక్రమంగానే జరిగింది.

మొదటి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు అందించారు. అనంతరం 60 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేశారు. అయితే, కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు ఇవ్వాలని నిర్ణయించినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. వ్యాక్సిన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో చాలా రాష్ట్రాల్లో టీకాల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. దీనికి తోడు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లో చాలామంది లబ్ధిదారులు మొదటి డోసు టీకాలే తీసుకోలేకపోయారు. అయితే, ఆగస్టు నాటికి వ్యాక్సిన్ సరఫరా మెరుగవుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది.

Covid Vaccine


అయితే, ఈ ఏడాది చివరి నాటికి మొత్తం జనాభాకు కరోనా టీకాలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ తయారీదారులకు, టీకా మోతాదుల లభ్యతను పెంచడంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు మద్దతు ఇస్తోందన్నారు. భారత్‌ 267 కోట్ల వ్యాక్సిన్‌ మోతాదులను కొనుగోలు చేస్తుందని, జూలై నాటికి 51 కోట్ల మోతాదులను సేకరించనున్నట్లు చెప్పారు.

ఇదిలావుంటే, ఇప్పటికే ప్రపంచ దేశాల్లో వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లకు భారత్‌ అనుమతి ఇచ్చింది. దీనికి తోడు దేశంలో టీకా తయారీ కేంద్రాలకు కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రెండు బిలియన్ డోసుల స్టాక్ భారత్‌ వద్ద ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ, ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాయి. అయితే, అంతర్జాతీయంగా కూడా టీకాల సరఫరా పరిమితంగానే ఉంది. వీటన్నింటినీ బట్టి చూస్తే, పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

పెద్ద ఎత్తున టీకాలు వేయకపోతే, ఆ ప్రభావం ఆర్థిక కార్యకలాపాలపై పడే అవకాశం ఉంది. దీనికి తోడు సామాజికంగా కూడా అనిశ్చితులు నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్తక, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు, పాఠశాలలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు, అంతర్జాతీయ ప్రయాణాలు.. వంటి అన్ని కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న ఆగస్టు మధ్య వరకు ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి సోకకుండా వ్యక్తిగత రక్షణ పద్ధతులు పాటించాలి. ఆఫీసులు, ఇతర పని ప్రదేశాల్లో కోవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకునే లోపు సాధారణ పరిస్థితులు నెలకొన్నా కూడా.. ఏరోసోల్స్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి ఇళ్లు, కార్యాలయాలు, కర్మాగారాలు, దుకాణాలు, పాఠశాలలు, కళాశాలల్లో పూర్తిస్థాయి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు, వాతావరణ కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మందగించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల గాలి కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో నివసించేవారు ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. రెండు మాస్కులు కలిపి ధరించడం, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత.. వంటి కోవిడ్ మార్గదర్శకాలను ఏమాత్రం విస్మరించకూడదని సూచిస్తున్నారు. దీంతో పాటు సూపర్ స్ప్రెడర్‌ల ద్వారా వేగంగా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్న అన్ని కార్యకలాపాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. పండుగలు, ర్యాలీలు, ఎన్నికలు, రద్ధీకి కారణమయ్యే అన్ని రకాల కార్యక్రమాల్లోనూ పరిమిత సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చూడాలి. వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు, రద్దీని నివారించే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు వెల్లడించారు.

వ్యక్తుల ప్రాణాలకు భరోసా ఇచ్చే వ్యాక్సిన్లను ప్రణాళిక ప్రకారం పంపిణీ చేయాలి. ముందు తీవ్రమైన వ్యాధికి గురయ్యే వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు, 45 ఏళ్లు పైబడిన వారు.. ఇలా లబ్ధిదారులను వర్గీకరించాలి. ఈ జాబితాల్లో ఉన్న అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళిక ఉండాలి. 2021 చివరి నాటికి చిన్నపిల్లలపై ప్రయోగిస్తున్న వ్యాక్సిన్లు సైతం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే అప్పటికి భారతదేశ జనాభా మొత్తానికి టీకాలు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే, అంచనా వేసిన దానికంటే ఇంకా ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లు సరఫరా చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

గ్లోబల్ ట్రయల్స్‌లో అనేక కొత్త రకం టీకాలు ఉన్నాయి. వైరస్ సంక్రమణ, తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. వీటిలో ముక్కు ద్వారా ఇచ్చే టీకాలపై నిపుణులు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి మ్యూకోసల్ వ్యాక్సిన్లు పిల్లలకు ఇవ్వడం కూడా సులభం అవుతుంది. వీటి వల్ల వ్యాక్సిన్ వయల్స్, సిరంజీలు, ఇతర వ్యాక్సిన్ వ్యర్థాలు తగ్గుతాయి. వీటి తయారీ, సేకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది.

ఇదిలావుంటే, వ్యాక్సిన్లపై పేటెంట్‌ హక్కులను మినహాయించాలని భారత్, దక్షిణాఫ్రికా చేస్తున్న డిమాండ్‌కు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఇచ్చే పేటెంట్ మినహాయింపు వల్ల భారత్‌ ఎక్కువ మొత్తంలో టీకా లభ్యతను పెంచుకునే అవకాశం ఉంది. గతంలో ఈ ప్రతిపాదనను అమెరికా వ్యతిరేకించినప్పటికీ, భారత్ వాదనకు అగ్రరాజ్యం మద్దతు పలకడం విశేషం. ఈ ప్రతిపాదనను ప్రపంచ వాణిజ్య సంస్థ అంగీకరిస్తే, కొన్ని నెలల తర్వాత విదేశీ వ్యాక్సిన్లను దేశంతో తయారు చేసే అవకాశం కలుగుతుంది. ఒకవేళ డబ్ల్యూటీఓ ప్రక్రియ నిలిచిపోయినా, అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి చర్యను అనుమతించే దోహా డిక్లరేషన్ ద్వారా భారత ప్రభుత్వం తప్పనిసరి లైసెన్సులను జారీ చేయవచ్చు.

వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం భారీ స్థాయిలో పెరగాల్సిన అవసరం ఉందని ప్రస్తుత పరిస్థితులు పాఠాలు నేర్పించాయి. ఈ క్రమంలో టీకా తయారీ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవేటు రంగ సామర్థ్యంపై మాత్రమే ఆధారపడటం ఖర్చుతో కూడుకున్న విషయం. దీనికి తోడు ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవడానికి విపరీతంగా ఖర్చయ్యే అవకాశం ఉంది. అందువల్ల లైసెన్సింగ్ ద్వారా దేశంలో టీకాలను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రపంచంలో నమ్మకమైన వ్యాక్సిన్ సరఫరాదారుగా భారతదేశం తన ఖ్యాతిని పునరుద్ధరించాలంటే, మన ఉత్పాదక సామర్థ్యాన్ని విస్తరించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కూడా ఈ వృద్ధి కనిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

Covid Vaccine


దీనికి తోడు వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించాలి. ఇందుకు అన్ని రాజకీయ పక్షాలు బాధ్యత తీసుకోవాలి. తమ వంతు వచ్చే వరకు లబ్ధిదారులు వేచి చూడాలి. ఈ విషయంలో దేశ పౌరులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. అప్పటి వరకు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మహమ్మారికి దూరంగా ఉండాలి.

ఇదిలావుంటే, గ‌డ‌చిన 40 రోజుల్లో దేశంలో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ గ‌తంతో పోలిస్తే 50 శాతం మేర‌కు ప‌డిపోయింది. ఒక‌వైపు కరోనా కేసులు పెరుగుతుండ‌టం, మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ మంద‌గించ‌డంపై నిపుణులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెల‌లో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగ‌వంతంగా జ‌రిగింది. అయితే, మే మాసం వ‌చ్చే నాటికి రోజువారీ అందించే వ్యాక్సినేష‌న్ మోతాదుల సంఖ్య సగానికి పడిపోయింది.

ఏప్రిల్ 10న దేశవ్యాప్తంగా ఒకే రోజులో అత్యధికంగా 36,59,356 టీకాలు వేశారు. ఇదే ఇప్పటివరకు అత్యధికంగా టీకాలు వేసిన రోజు. అయితే, ఆ తరువాత నుంచి రోజువారీ టీకాలు వేసే మోతాదుల సంఖ్య దిగ‌జారింది. మే 21 న ఇరవై నాలుగు గంటల్లో 17,97,274 మోతాదుల టీకాలు మాత్రమే వేశారు. గ‌డ‌చిన 40 రోజుల్లో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ 50.88 శాతానికి ప‌డిపోయింది. గడ‌చిన‌ ఏప్రిల్‌లో దేశంలో రోజుకు సగటున 30,24,362 మోతాదులు టీకాలు ఇచ్చారు. మేలో ఈ సంఖ్య రోజుకు సగటున 16,22,087 మోతాదులకు పడిపోయింది. కోవిడ్ 19 ఇండియా ఆర్గనైజేష‌న్ వెల్లడించి వివ‌రాల ప్రకారం మే 1నుంచి మే 20 మ‌ధ్యకాలంలో రోజువారీ టీకాల సంఖ్య 20 లక్షల కంటే తక్కువగానే న‌మోద‌వుతూ వ‌స్తోంది. వ్యాక్సిన్ల కొర‌త‌తో ప‌లు వ్యాక్సినేష‌న్ సెంట‌ర్లు మూత‌ప‌డ్డాయి.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌పై గందరగోళం నెలకొంది. ప్రభుత్వ ఆదేశాలతో వారం రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారన్నది తెలియని పరిస్థితి. ఇటు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి 2లక్షల డోసులు ఉన్నాయని తెలుస్తోంది. కానీ కేంద్రం మాత్రం 4లక్షల డోసులు ఉండాలని లెక్కలేస్తోంది. డోసుల సంఖ్య ఎలా ఉన్నా.. వ్యాక్సినేషన్ ఎప్పుడు షురూ చేస్తారన్న దానిపై స్పష్టం రావడం లేదు.

తెలంగాణలో ప్రస్తుతం 50వేల కోవాగ్జిన్ డోసులు మాత్రమే ఉన్నాయి. అయితే, మొదటి డోసు ఎప్పుడు ప్రారంభిస్తారన్నది తెలియడం లేదు. మరోవైపు, రెండో డోసు కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. మొదటి డోసు వేసుకుని చాలా రోజులైందని.. ఆ తర్వాత వేసుకుటే ఫలితం ఉంటుందా అన్న సందేహం జనాన్ని వెంటాడుతోంది. ఆరోగ్యశాఖ మాత్రం వ్యాక్సినేషన్ ప్రారంభ తేదిని త్వరలోనే అనౌన్స్‌ చేస్తామని చెబుతోంది.

Read Also….  Coronavirus : గుడ్‌న్యూస్‌, కరోనా చికిత్సకు అందుబాటులోకి రానున్న కొత్త మందు