Covid 19: భారత్‌లో ఆందోళన కలిస్తోన్న కరోనా.. రూపం మార్చుకుంటున్న మహమ్మారి.. పెరుగుతున్న మరణాలు.. దేనికి సంకేతం?
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.
Covid 19 Second Wave Spread: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిమిషానికి 243 పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం. అయితే, తాజా పరిస్థితులు ఆందోళనకరమైనవే అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.
సెకండ్ వేవ్ ధాటికి కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా 3లక్షల 23వేల 144 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వరుసగా ఐదో రోజు 3లక్షలకు పైగా కేసులు నమోదు కావడం కలవరపెట్టే విషయం. ఇలా నిమిషానికి సరాసరి కొత్తగా 243 కేసులు రికార్డవుతున్నాయి. ఇక కొవిడ్ మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. నిమిషానికి దాదాపు ఇద్దరు కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. అస్సాం, బెంగాల్, బీహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో తాజా రోజువారీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
గత సంవత్సరం కరోనా వైరస్ వచ్చిన కొత్తలో… ఒకరికి వైరస్ వస్తే… మరో ఇద్దరు లేదా ముగ్గురికి అది సోకగలదు అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ వైరస్ చాలా రకాలుగా మారి… రూపాంతరాలు చెంది… ఇదివరకటి కంటే ఎక్కువ వేగంగా వ్యాపిస్తోంది. మరి ఇప్పుడు ఒకరికి వైరస్ వస్తే… 406 మందికి కరోనా వైరస్ అంటుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర వైద్యారోగ్య శాఖ చెప్పింది. కరోనా పేషెంట్ లేదా అతని చుట్టుపక్కల వారు భౌతిక దూరం పాటించకపోతే… ఆ పేషెంట్ ద్వారా ఈ వైరస్ 406 మందికి వ్యాపించగలదని తేల్చిచెప్పింది.
ఇక, మొత్తం భారతదేశంలో మరణాల రేటు గత వారంలో 0.55 శాతం నుండి 0.69 శాతానికి పెరిగింది. ఏప్రిల్ 24 తో ముగిసిన వారంలో సగటున మరణాల రేటు 1 శాతానికి మించి ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయని నివేదిక చూపిస్తుంది. ప్రధాన రాష్ట్రాల్లో, మరణాల రేటు 1.43 శాతంతో పంజాబ్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. జాతీయ రాజధానిలో మరణాల రేటు 0.62 శాతం నుండి 1.1 శాతానికి పెరిగింది. ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా ఢిల్లీ మరణాల రేటు పెరగడానికి ప్రధాన కారణం. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలైన బెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో కూడా మరణాల రేటులో పెద్ద ఎత్తున దూసుకెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే క్రమంలో అయా రాష్ట్రాల్లోని శ్మశానవాటికలలో పొడవైన క్యూలను చూస్తే దీనికి బలం చేకూరుస్తోంది. ప్రధాన రాష్ట్రాల్లో ఏప్రిల్ 24 తో ముగిసిన వారంలో హర్యానా, కేరళ, కర్ణాటక, పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా నమోదవుతోంది. అయినప్పటికీ, అస్సాం, బీహార్, ఒడిశా, కేరళ నాలుగు రాష్ట్రాలు 2 కంటే ఎక్కువ ఉన్నాయి.
ఈ మేరకు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ఈ పరిశోధన చేసింది. వాస్తవానికి, భారతదేశంలో నిర్వహించిన ప్రతి ఐదు పరీక్షలలో ఒకరి కరోనా నిర్దారణ అవుతోంది. ఇది గత వారం క్రితం ఏడుగురిని పరీక్షిస్తూ ఒకరికి మాత్రమే కరోనా సోకేది. ఏప్రిల్ 24 తో ముగిసిన వారంలో ఏడు రోజుల సగటు టెస్ట్ పాజిటివిటీ రేట్లు మొత్తం కోవిడ్ నిర్ధారణ పరీక్షలలో 9 శాతంగా ఉంది. ఇది వారం క్రితం 14 శాతానికి పైగా ఉంది. ఏడు ప్రధాన రాష్ట్రాలు ఇది 20 శాతానికి పైగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వారపు సగటు 30 శాతానికి పైగా ఉన్నట్లు నివేదించింది. గత వారంలో టిపిఆర్‌లో భారీగా పెరిగిన రాష్ట్రాలు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. మరోవైపు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లలో ఇప్పుడిప్పుడే టీపీఆర్ మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది.
మిచిగాన్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ప్రెసిషన్ హెల్త్ డేటా సైన్స్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, భారతదేశంలో సగటున కరోనా వ్యాప్తంగా1.53 గా ఉందని అంచనా వేసింది. ప్రొఫెసర్ భ్రామర్ ముఖర్జీ నేతృత్వంలోని బృందం అధ్యయనం ప్రకారం… ఒకసారి సోకిన వ్యక్తి, సగటున, 1.5 కంటే ఎక్కువ మందికి సోకుతుంది. ఏప్రిల్ 17 తో ముగిసిన వారానికి సగటు 1.56 వద్ద ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో ఇది 1.5 కన్నా తక్కువ. కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని సూచిస్తుంది.
కరోనా వచ్చిన ఒక వ్యక్తి… నెల రోజుల్లో 406 మందికి వైరస్‌ని వ్యాప్తి చేయగలరని తేల్చింది. కావాలని అంటించకపోయినా… కోవిడ్ నిబంధనలు పాటించకపోతే… ఆటోమేటిక్‌గా వైరస్ ఇతరులకు వెళ్తుందన్నమాట. ఇది చదివి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ వాడితే మనకు ఏం కాదు. అయితే… కరోనా వచ్చిన వ్యక్తికి అది 2 వారాల్లోనే నయం అవుతుంది. కొంతమంది మాత్రమే ప్రాణాలను కోల్పోతున్నారు. కానీ… నెలపాటూ కరోనా సోకిన వారు ఉండట్లేదు. నయం కావడమో, చనిపోవడమో ఏదో ఒకటి త్వరగా జరిగిపోతోంది.
కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తూ… ఈ విషయం బయటపెట్టింది. భౌతక దూరం పాటంచకపోతే ఎంత ప్రమాదమో చెప్పింది. నీతి ఆయోగ్‌లో ఆరోగ్య విభాగ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ చెప్పిన విషయాలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అత్యవసరం కాకపోతే బయటకు వెళ్లొద్దు అని ఆయన చెప్పారు. ఇంటికి బయటివారు వస్తున్నట్లైతే… ఇంట్లో ఉన్నవారంతా మాస్కులు పెట్టుకోవాలని చెప్పారు. ఇంట్లో ఉన్నవారు బయటి నుంచి వస్తున్నా… ఇంట్లో వారంతా మాస్క్ వాడాలని చెప్పారు. వీలైనంతవరకూ బయటి వారిని ఇంటికి ఆహ్వానించవద్దు అన్నారు.
సోషల్ డిస్టాన్స్ గనక 50 శాతం పాటిస్తే… ఒక వ్యక్తి నుంచి కరోనా 15 మందికి సోకుతుందనీ… అదే 75 శాతం పాటిస్తే… ఒక వ్యక్తి నుంచి కరోనా 2.5 మందికి వ్యాపిస్తుందని చెప్పారు. అదే వంద శాతం పాటిస్తే సమస్య ఉండదు అన్నారు. ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ… పాటించడం కష్టం. ఛాన్స్ ఉంటే దేశ ప్రజలు పాటిస్తారు. కానీ… తెల్లారి లేస్తే… సామాన్య, మధ్యతరగతి వారు ఎన్నో పనులకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణాలు చెయ్యాల్సి ఉంటుంది. జనాభా ఎక్కువ కాబట్టి… భౌతిక దూరం అనేది పాటించడం ఎవరి వల్లా కావట్లేదు. కొద్ది మంది మాత్రమే పాటించడం వీలవుతోందన్నది గణాంకాలు చెబుతున్న మాట.
కరోనా ఇలాగే పెరిగితే ఏమవుతుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. దీనికి పరిశోధకులు ఆందోళన కలిగించే విషయం చెప్పారు. వైరస్‌లు నిరంతరం తమ శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయట. కాబట్టి ఇప్పుడు గనక ఇండియాలో కరోనాను తగ్గించకపోతే… వైరస్ మరింత బలంగా మారి… మున్ముందు మరింత వేగంగా వ్యాపిస్తుందని అంటున్నారు. ఆ ప్రభావం థర్డ్ వేవ్‌లో కనిపిస్తుందట. అప్పుడు వ్యాక్సిన్లు కూడా దాన్ని ఆపలేవు అంటున్నారు. అంతదాకా పరిస్థితి రాకూడదనే కోరుకుందాం.