Covid 19 Omicron: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ టెన్షన్‌.. బూస్టర్‌ డోసు తీసుకోవడం తప్పదా..?

|

Dec 09, 2021 | 4:17 PM

Booster Dose to Omicron: దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ టెన్షన్‌ పెడుతోంది. అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే బూస్టర్‌ డోస్‌ ఒమిక్రాన్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని అంటున్నారు నిపుణులు.

Covid 19 Omicron: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ టెన్షన్‌.. బూస్టర్‌ డోసు తీసుకోవడం తప్పదా..?
Omicron
Follow us on

Covid 19 Omicron Variant: దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ టెన్షన్‌ పెడుతోంది. అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే బూస్టర్‌ డోస్‌ ఒమిక్రాన్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని అంటున్నారు నిపుణులు. న్యూ వేరియంట్‌ను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. జెట్‌ స్పీడ్‌తో విస్తరిస్తూ ప్రపంచదేశాలపై పంజా విసురుతోంది. వరల్డ్‌ వైడ్‌గా 2వేలమందికి పైగా ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. ఇక మనదేశంలో ఇప్పటివరకు 24 కేసులు నమోదయ్యాయి. ఐతే తాజాగా మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ను జయించాడు ఓ యువకుడు. రిపోర్టుల్లో నెగెటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసిన వైద్యులు..వారం పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

అయితే, న్యూ వేరియంట్‌ విజృంభణతో మరింత అప్రమత్తమైన కేంద్రం.. ఒమిక్రాన్‌ బాధితులకు కొవిడ్‌ ఆస్పత్రుల్లోనే ట్రీట్‌మెంట్‌ అందించాలని స్పష్టం చేసింది. ఒమిక్రాన్‌ బారిన పడిన వారిని ఐసోలేషన్‌లో ఉంచాలని..వారి నుంచి వైరస్‌ ఇతరులకు వ్యాపించకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ న్యూ స్ట్రెయిన్‌ను నియంత్రించాలంటే వ్యాక్సిన్‌తో పాటు కొవిడ్‌ రూల్స్‌ పాటించాలని తేల్చి చెప్పింది. ఇక, కరోనా వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తున్న ఫైజర్‌ టీకా.. ఒమిక్రాన్‌ నుంచి మాత్రం పాక్షికంగానే రక్షణ కల్పిస్తోందని తెలిపింది సౌతాఫ్రికా హెల్త్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌. అయితే, బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్‌ నుంచి రక్షణ లభిస్తుందని అభిప్రాయపడింది.

కొవిడ్‌ బారినపడి, రెండు డోసుల టీకా తీసుకున్నవారికి కూడా మహమ్మారి నుంచి రక్షణ లభిస్తుందని వెల్లడించింది. ఇక అటు ఫైజర్‌ సంస్థ కూడా.. తమ టీకా తొలి రెండు డోసులు ఒమిక్రాన్‌పై అంతగా ప్రభావం చూపకపోయినా, బూస్టర్‌ డోసు యాంటీబాడీలను 25 రెట్లు పెంచుతుందని తెలిపింది. మరోవైపు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నియంత్రించేందుకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది WHO. వేరియంట్‌లో జరుగుతున్న ఉత్పరివర్తనాలు ఆందోళనకరంగా ఉన్నాయని..పేద దేశాలకు మరిన్ని వ్యాక్సిన్‌లను అందుబాటులో ఉంచాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఇక ఒమిక్రాన్‌ వేరియంట్‌లో ఉన్న మొత్తం 37 ఉత్పరివర్తనాలను సమర్థవంతంగా అణచివేసేలా.. సొట్రోవిమాబ్‌ అనే డ్రగ్‌ను అభివృద్ధి చేసింది బ్రిటన్​కు చెందిన సంస్థ. ప్రయోగశాలలో ఒమిక్రాన్‌ను పోలిన వైరస్‌పై ఈ మందును ప్రయోగించగా..సత్ఫలితాలు నమోదైనట్లు ప్రకటించింది.

Read Also…  CM Jagan on Irrigation: ఏపీ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు!