Coronavirus tests for pets: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు భారత్‌లోనే నమోదవుతున్నాయి. ఈ తరుణంలో జంతువులకు కూడా వైరస్ వ్యాపిస్తోంది. తాజాగా దేశంలోనే మొదటిసారిగా ఎనిమిది సింహాలకు కరోనా పాజిటివ్‌గా వెల్లడైంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ (ఎన్‌జెడ్‌పి) లోని ఎనిమిది ఆసియా సింహాలు కోవిడ్ బారిన పడ్డాయి. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థ ఈ విషయాన్ని ఏప్రిల్ 29న ఎన్‌జెడ్‌పి అధికారులకు మౌఖికంగా తెలిపింది. సింహాలకు జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఈ సింహాలకు పాజిటివ్ వచ్చినట్టు సీసీఎంబీ తెలిపింది. ఇదిలాఉంటే.. ముందుగా సౌత్ కొరియాలో, పలుచోట్ల పెంపుడు జంతువులకు కరోనా సోకింది. దీంతో యజమానులు పెంపుడు జంతువులకు కూడా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ అని వస్తే వైద్యుల సూచనల ఆధారంగా మెడిసిన్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ కొరియా ఫిబ్రవరిలోనే కీలక నిర్ణయం తీసుకుంది.
పెంపుడు జంతువులకు కరోనా టెస్టులను ఉచితంగా చేయాలని ఆ దేశ సర్కారు ఫిబ్రవరిలోనే కీలక నిర్ణయం తీసుకుంది. నోరులేని మూగజీవాలు కరోనా బారిన పడటాన్ని ఆసరాగా మార్చుకోని.. డబ్బు సంపాదించడానికి పూనుకోవద్దని ఆసుపత్రులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. టెస్టుల్లో ఒకవేళ పాజిటివ్ అని వస్తే తప్పనిసరిగా ఆ పెంపుడు జంతువులను 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచాలని స్పష్టం చేసింది. కరోనా సోకిన యజమానులు.. తమ పెంపుడు జంతువులకు కూడా విధిగా టెస్టులను నిర్వహించాలని సూచించింది. కాగా భారత్‌లో కూడా సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన నేపథ్యంలో జంతువులకు కూడా పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కరోనా పరీక్షలు చేయడం వల్ల అప్రమత్తంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు.
Also Read: