కరోనా(Coronavirus) కేసులు తగ్గాయి కదా అని సంబరపడిపోకండి.. కొంచెం గ్యాప్ ఇచ్చిందంతే. కొన్ని రోజులుగా కాస్త నెమ్మదించిన మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగం పెంచింది. దేశాన్ని వణికిస్తోంది. దేశంలో పెరుగుతున్న రోజువారీ కేసులు మళ్లీ కలవరం రేపుతున్నాయి. అంతేకాదు దేశంలో మరో కొత్త రకం కరోనా వేరియంట్ వెలుగు చూడటం కలకలం రేపుతోంది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలన కావట్లేదు. ఏదో ఒక కొత్త రూపంలో పుట్టుకొస్తూనే ఉంది.. గడగడలాడిస్తోనే ఉంది. భారత్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ కొత్త బాంబు పేల్చింది. భారత్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు వెల్లడించింది. బీఏ 2.75 వేరియంట్‌గా నిర్ధారించినట్లు పేర్కొంది. భారత్‌లో కనీసం 10 రాష్ట్రాల్లో ఈ కొత్త రకం సబ్ వేరియంట్‌ను గుర్తించినట్లు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇప్పటివరకు కరోనా సీక్వెన్సులకు సంబంధించిన 85 వేరియంట్‌లను గుర్తించామని అన్నారు.
టెల్ హాషోమర్‌లోని షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన షీఫ్లాన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. జులై రెండో తేదీ నాటికి మహారాష్ట్రలో 27, పశ్చిమ బెంగాల్‌లో 13, ఢిల్లీ, జమ్ము, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కోటి, హర్యానాలో ఆరు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు, కర్ణాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణలో రెండు కలిసి మొత్తం 69 కేసుల్లో కొత్త సబ్ వేరియంట్‌ను గుర్తించినట్టు షీఫ్లాన్ తెలిపారు. ఇది రాబోయే ట్రెండ్‌ను సూచిస్తోందని, ఈ వేరియంట్ ఆందోనకరంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
దేశంలో తొలిసారిగా ఓమిక్రాన్ వైరస్ కొత్త ఉప–వేరియంట్‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ సైతం తెలిపింది. దీనికి బీఏ.2.75 అని పేరు పెట్టారు. యూరప్–అమెరికాలో బీఏ.4 , బీఏ.5 కేసులు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. భారత్ వంటి దేశాల్లో బీఏ.2.75 అనే కొత్త సబ్–వేరియంట్ ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది.
ఈ వేరియంట్ తొలిసారిగా భారత్‌లో కనిపించిందని, తర్వాత మరో 10 దేశాల్లోనూ గుర్తించామని టెడ్రోస్ వెల్లడించారు. కాగా డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య గత రెండు వారాల్లో ఏకంగా 30 శాతం పెరిగింది. కాగా, గత 24 గంటల్లో భారత్‌లో 18,930 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌తో మరో 35 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 1,17,893కు పెరిగాయి.
ఈ మధ్యకాలంలో రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసుల పెరుగుదల కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంటోంది. ఒమిక్రాన్ ఉప వేరియంట్ వల్లే కరోనా వ్యాప్తి పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మహారాష్ట్ర-27, పశ్చిమ బెంగాల్-13, కర్ణాటక-10, మధ్య ప్రదేశ్-5, తెలంగాణ-2, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో ఒకటి చొప్పున కొత్త వేరియంట్‌కు చెందిన పాజిటివ్ కేసులు గుర్తించినట్లు డాక్టర్ షాయ్ వివరించారు. మరో ఏడు దేశాల్లో కూడా ఇదే వేరియంట్ పుట్టుకొచ్చినట్లు చెప్పారు. ఈ వేరియంట్‌కు చెందిన వైరస్ వ్యాప్తి చెందినట్లు ఇంకా నిర్ధారణ కాలేదని, దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్నామని పేర్కొన్నారు.
కొత్త వేరియంట్‌పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్పందించింది. కొత్త వేరియంట్లు పుట్టుకురావడం ఊహించిందేనని, వైరస్ ఎప్పటికప్పుడు తన మ్యూటెంట్లను మార్చుకుంటుందని అన్నారు. దీనిపట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు అధికారులు. ప్రస్తుతానికి కోవిడ్ వ్యాప్తి చెందట్లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ తాము అప్రమత్తంగా ఉన్నామని, కోవిడ్ స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొటోకాల్స్‌ను అమల్లోనే ఉన్నాయని చెప్పారు.
ఇటు తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది స్టాలిన్ సర్కార్. నేటి నుంచి మాస్క్ తప్పనిసరి , కరోనా ఆంక్షలు అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాస్క్ ధరించకపోయినా,భౌతిక దూరం పాటించకపోయిన జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించేలా అన్ని జిల్లాలో వైద్య పరీక్షలను పెంచాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ లు కరోనా కేసులపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలన్నారు స్టాలిన్.