Corona Positive: ఆమధ్య ఒకాయన తన గేదెకు మాస్క్ కట్టాడు. కోవిడ్ నుంచి తన గేదెను రక్షించుకోవడం కోసం అని ఆటను చెబితే అందరూ నవ్వుకున్నారు. కానీ, ఇప్పుడు వినవచ్చిన ఒక వార్త షాకింగ్ గా వుంది. దేశంలోనే మొదటిసారిగా ఎనిమిది సింహాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ (ఎన్‌జెడ్‌పి) లోని ఆసియా సింహాలు కోవిడ్ బారిన పడ్డాయి. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థ ఈ విషయాన్ని ఏప్రిల్ 29న ఎన్‌జెడ్‌పి అధికారులకు మౌఖికంగా తెలిపింది. సింహాలకు జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఈ సింహాలకు పాజిటివ్ వచ్చినట్టు సీసీఎంబీ చెప్పింది. అయితే, నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్, డైరెక్టర్ డాక్టర్ సిద్ధానంద్ కుక్రెటి ఈ విషయాన్ని ఖండించలేదు అలాగని ధృవీకరించలేదు.
“సింహాలు కోవిడ్ లక్షణాలను చూపించాయన్నది నిజం, కాని నేను ఇంకా సీసీఎంబీ నుండి ఆర్టీపీసీఆర్ నివేదికలను చూడలేదు. అందువల్ల వ్యాఖ్యానించడం సరైనది కాదు. సింహాలు ప్రస్తుతం బాగానే ఉన్నాయి”అని డాక్టర్ కుక్రెటి అన్నారు. ”గత ఏడాది ఏప్రిల్ లో న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూ లో ఎనిమిది పులులు, సింహాలు కోవిడ్‌కు పాజిటివ్ గా నిర్ధారణ అయిన తరువాత, అడవి జంతువులలో ఎక్కడా ఇలాంటి కేసులు కనిపించలేదు. కానీ, హాంకాంగ్‌లో కుక్కలు, పిల్లులలో ఈ వైరస్ కనబడింది.” అని నగర వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ శిరీష్ ఉపాధ్యాయ్ చెప్పారు
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 24 న, జూ పార్క్ లో పనిచేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కునుంచి రసి కారడం అలాగే, దగ్గు వంటి కోవిడ్ లక్షణాలను గమనించారు. ఇది 40 ఎకరాల సఫారీ ప్రాంతం. ఇక్కడ 10 సంవత్సరాల వయస్సు గల 12 సింహాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు పాజిటివ్ గా తేలిందని తెలుస్తోంది.
జూ పార్క్ లో పనిచేస్తున్న పశువైద్యులు పానిక్ పరిస్థితి వివరించిన తరువాత, మేనేజిమెంట్ వారికి నమూనాలను తీసుకోవాలని సూచించింది. ఫీల్డ్ వెట్స్ సింహాల యొక్క ఒరోఫారింజియల్ (మృదువైన అంగిలి మరియు హైయోడ్ ఎముక మధ్య ఉండే ఫారింక్స్లో ఒక భాగం) శుభ్రపరచు నమూనాలను తీసుకొని వాటిని హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించాయి, దానితో ఎన్‌జెడ్‌పి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తం ప్రక్రియలో పాల్గొన్న వెటర్నరీ డాక్టర్ SA అసదుల్లా అని తెలిసింది. ఆయనను సంప్రదించాలని మీడియా ప్రయత్నించినా స్పందన రాలేదు.
ఈ వైరస్ జాతి మానవుల నుండి జంతువులకు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి సీసీఎంబీ శాస్త్రవేత్తలు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తారని జూ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 30 న ఎమ్వోఈఎఫ్సీసీ(MoEFCC), సీసీఎంబీ శాస్త్రవేత్తలు, సెంట్రల్ జూ అథారిటీ (CZA) అలాగే ఎన్జెడ్పీ(NZP) అధికారుల వర్చువల్ సమావేశం జరిగిందని తెలుస్తోంది. దీనిలో సింహాలను పరీక్షించడంపై చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో తాను కూడా పాల్గొన్నానని డాక్టర్ కుక్రెటి తెలిపారు. “సింహాల కేసు తరువాత, ఏప్రిల్ 30 న దేశంలోని ప్రధాన వన్యప్రాణి వార్డెన్లకు అన్ని జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాలు అలాగే, టైగర్ శాంచురీలు మూసివేయమని ఎమ్వోఈఎఫ్సీసీ(MoEFCC) ఒక వివరణాత్మక సలహా ఇచ్చింది. ఇది మానవుల నుండి జంతువులకు వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయం కలిగిస్తోంది.” అని ఆ వర్గాలు తెలిపాయి.
నెహ్రూ జూలాజికల్ పార్క్ రెండు రోజుల క్రితం మూసివేశారు. ఇది జనసాంద్రత ఉన్న ప్రాంతంలో ఉన్నందున, ఇప్పుడు గాలిలో కూడా ఉన్న వైరస్, జూ పరిసరాల్లో నివసించే ప్రజల నుండి సింహాలకు సోకి ఉండవచ్చు. లేదా ఇది జూ-కీపర్లు లేదా సంరక్షకుల నుండి వచ్చిన అవకాశం కూడా ఉంది అని జూ వర్గాలు తెలిపాయి, ఇటీవల 25 మందికి పైగా పార్క్ సిబ్బంది కోవిడ్‌కు పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు.
Also Read: సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్న గున్న ఏనుగు..వావ్ అంటున్న నెటిజెన్లు..: Elephant Viral Video.
Kindness: హోరు వర్షంలో రోడ్డుమీద తడుస్తూ కుక్క.. అప్పుడు ఆ చిన్నారి ఏం చేసిందో చూడండి..Viral Video