కర్నాటక పోలీసులను కరోనా వెంటాడుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో పోలీసులు కరోనాకు చిక్కుతున్నారు. గత వారం రోజుల్లోనే 27 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా విధుల్లో ఉన్నటువంటి చాలా మంది పోలీసులకు కరోనా సోకడంతో ఆందోళన మొదలైంది.
బెంగళూరు నగరంలోని ఒక్క వైట్‌ఫీల్డ్ డివిజన్ పరిధిలోనే 27మంది పోలీసులు కరోనా బారినపడినట్లు అధికారులు వెల్లడించారు. సిబ్బందికి ఇటీవల నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో వైట్‌ఫీల్డ్ డివిజన్ పరిధిలోని 15మందికి, హేచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 12మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ తెలిపారు.
వీరిలో ఐదుగురు చికిత్సకు కోలుకొని తిరిగి విధుల్లో చేరారని పేర్కొన్నారు. హాల్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తించే పోలీసుల్లో ఒక్కరికి గత నెల 27న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణకాగా అప్పటి నుంచి పోలీసు స్టేషన్‌ను హాట్ స్పాట్ సెంటర్ మార్చామన్నారు.