Corona suicides : చనిపోతామన్న భయమే కరోనా వైరస్ సోకిన వాళ్ల ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణమవుతుందని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. నాకేం కాదు.. అనే మనో నిబ్బరంతో ధైర్యంగా ఉంటే వైరస్ తోకముడుస్తుందని ఘంటాపథంగా చెప్పుకొస్తున్నారు. అయితే, కొందరు తమకు కరోనా సోకిందేమోనన్న సందేహంతోనే ఆత్మహత్యలకు పాల్పడుతుండటం హృదయ విదారకంగా మారుతోంది. తనకు కరోనా వచ్చిందేమోనని మనోవేదనతో కనకరాజు అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం హిమ్మత్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. అటు, హన్మకొండ న్యూశాయంపేటకు చెందిన వివాహిత కవిత కూడా ఇలాగే తనువు చాలించడం పరిస్థితికి అద్దం పడుతోంది. కవిత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ తనకు కరోనా వచ్చిందనే అనుమానంతో మనోవేదనకు గురై సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సుబేదారి ఎస్సై రాఘవేందర్ తెలిపారు. కవిత భర్త కిషన్‌కు ఇటీవల కరోనా సోకగా చికిత్స కోసం సుమారు రూ. 6 లక్షల వరకు ఖర్చు అయినట్టు ఎస్సై చెప్పారు. ఇక మరో ఘటన విషయానికొస్తే, జనగామ జిల్లాకు చెందిన కనకరాజు అనే యువకుడి మృతి మరింత దయనీయం.
హిమ్మత్ నగర్ గ్రామస్థుల కథనం ప్రకారం.. నారబోయిన భిక్షపతి చిన్న కుమారుడు కనకరాజు (26) ఎంఎస్సీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల కాజీపేట మండలం కడిపికొండలో ఉండే బంధువు కరోనాతో మృతిచెందగా కనకరాజు అక్కడికి వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చాక స్వల్పంగా జ్వరం వస్తుండటంతో కొవిడ్ సోకిందేమోనని ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు. సోమవారం కనకరాజు కనపడకపోవడంతో కుటుంబసభ్యులు గాలించగా తొమ్మిది గంటల ప్రాంతంలో గ్రామ శివారులోని చెట్ల పొదల్లో గుర్తు తెలియని శవం కాలిపోతోందని తెలిసింది. జఫర్‌గఢ్ ఎస్సై కిశోర్ స్థలానికి వచ్చి వర్ధన్నపేట ఏసీపీ రమేష్, సీఐ విశ్వేశ్వర్‌కు సమాచారం అందించారు. ఆ శవం కనకరాజుదేనని సోదరుడు సంతోష్ పోలీసులకు తెలిపారు. ఈ రెండు ఘటనలు ఆయా గ్రామాల్లో తీవ్ర కలవరానికి కారణమయ్యాయి.